ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఉపాధ్యాయ సంఘాలు మొదటి రోజు రోడ్డెక్కాయి. ఫ్యాప్టో ఆధ్వర్యంలో పీఆర్సీకి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించాయి. ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి జోరుగా సాగింది. పీఆర్సీ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేస్తూ ఉద్యోగులు ఆందోళనలు చేశాయి. పలు జిల్లాల్లో కలెక్టరేట్ల ప్రధాన ద్వారాల వద్ద ఉపాధ్యాయులు బైఠాయించగా.. పోలీసులు, ఉపాధ్యాయుల మధ్య తోపులాటలు కూడా జరిగాయి.


పోలీసులు ఉపాధ్యాయులు కలెక్టరేట్లకు రాకుండా పలువురిని ముందస్తు అరెస్టులు కూడా చేశారు. పలు చోట్ల ఉపాధ్యాయులను కూడా అరెస్టు చేశారు. ఈ అరెస్టులను వ్యతిరేకిస్తూ పోలీసుస్టేషన్ల వద్ద నిరసనలు కూడా జరిగాయి. ఈ వ్యవహారం చూస్తే ఇదేదో జగన్‌కు నెగిటవ్‌గా మారుతుందన్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ... జాగ్రత్తగా గమనిస్తే.. ఈ వ్యవహారం జగన్‌కు కాస్త కలిసొచ్చేలానే కనిపిస్తోంది. ఎందుకంటే.. మొదట చర్చలకు ఆహ్వానించిన సీఎం.. అనేక ఉద్యోగ సంఘాల నేతలతో నేరుగా మాట్లాడారు.


జగన్ ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడి ఒప్పించాకే పీఆర్సీ ప్రకటించారు. అయితే.. సీఎంతో చర్చించిన సమయంలోనే ఉద్యోగ సంఘాల నాయకులు తమ డిమాండ్లు ఇవీ అని గట్టిగా పట్టు పట్టలేకపోయారు. దీనికి తోడు... సీఎం చూపించిన రెండేళ్ల పదవీ విరమణ, ఇళ్లు స్కీమ్‌ చూసేసరికి మురిసిపోయి.. ఓకే చెప్పేసి బయటకు వచ్చారు. ఇప్పుడు కింద స్థాయి ఉద్యోగలంతా మళ్లీ నిలదీసేసరికి ఇప్పుడు సీన్ మార్చేస్తున్నారు.


కానీ.. ఈ వ్యవహారం చూసిన సాధారణ ప్రజలు.. ఉద్యోగులు గొంతెమ్మె కోర్కెలు కోరుతున్నారని భావించే ప్రమాదం ఉంది. అంతగా నచ్చకపోతే.. ముందు ఎందుకు ఒప్పుకున్నారన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. కరోనా కాలంలో జనమంతా ఇబ్బందులు పడితే.. ఉద్యోగస్తులకు మాత్రం కచ్చితంగా పెంచాల్సిందేనా అన్న చర్చ కూడా వస్తుంది. మొత్తానికి ఈ విషయంలో ఎటు చూసినా జగన్‌కు ప్లస్సే కనిపిస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: