రాష్ట్రంలో ప్ర‌జాప్ర‌తినిధులుగా ఉన్న అధికార పార్టీ నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌ల‌తో పార్టీ ఇరుకున ప‌డుతోంది. నేత‌లు దూకుడుగా ముందుకు సాగుతుండ‌డంతో పార్టీకి ఎక్క‌డా లేని ఇబ్బందులు వ‌స్తున్నాయి. దీంతో పార్టీ స‌ర్ధిచెప్పుకోవాల్సిన ప‌రిస్థితులు వ‌స్తున్నాయి. తాజాగా మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు చేసిన వ్యాఖ్య‌లు కాక రేపుతున్నాయి. ఆయ‌న శ్రీకాకుళంలో మాట్లాడుతూ.. టీడీపీ నేత‌లైనా.. ఎవ‌రైనా.. త‌మ మాట వినాల్సిందేన‌ని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. అలా విన‌క‌పోతే.. ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డం ఆపేస్తామ‌ని.. నిధులు కూడా ఇవ్వ‌బోమ‌ని తెగేసి చెప్పారు. ఈ వ్యాఖ్య‌లు మంటలు రేపుతున్నాయి.

నిజానికి జ‌గ‌న్ ఒక‌వైపు.. త‌మ ప్ర‌భుత్వం కులం, మ‌తం, ప్రాంతం, పార్టీల‌ను చూడ‌కుండా.. అంద‌రికీ ప‌థ‌కాలు అమ‌లు చేసేందుకు చూస్తోంద‌ని.. త‌మ ప్ర‌భుత్వానికి వివ‌క్ష లేద‌ని చెబుతున్నారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో మంత్రి మాత్రం ఇలా .. టీడీపీ వారైనా.. త‌మ మాట వినాల్సిందేన‌ని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్య‌లు పార్టీకి మేలు చేయ‌క‌పోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు పేరు తెచ్చుకున్నదంతా కూడా మునిగిపోయే ప్ర‌మాదం ఉంద‌ని.. పార్టీలోనే సీనియ‌ర్లు అంటున్నారు. మ‌రో వైపు.. క‌డప జిల్లాకే చెందిన ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు.. మరో వివాదాస్ప‌ద వ్యాఖ్య చేశారు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఉద్యోగులు ఆగ్ర‌హంతో ఉన్నారు. ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన పీఆర్సీని వారు వెన‌క్కితీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్ర‌భుత్వం ఉద్యోగుల‌ను శాంత ప‌రిచేందుకు నానా తంటాలు ప‌డుతోంది. ఇప్ప‌టికే క‌మిటీలు వేసింది. వారికి ఇత‌ర ప్ర‌యోజ‌నాలు క‌ల్పిస్తామ‌ని చెప్పింది. అంటే.. స‌ర్కారుకు కీల‌క‌మైన ఉద్యోగుల‌ను ఉద్య‌మం నుంచి త‌ప్పించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అంతేకాదు.. ఉద్యోగులు ప్ర‌భుత్వంలో భాగ‌మ‌ని అంటోంది. ఇలా, అనేక రూపాల్లో ప్ర‌భుత్వం ఉద్యోగుల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

అయితే.. ఎమ్మెల్యే మాత్రం ఉద్యోగులు మాట విన‌క‌పోతే.. అంటూ.. హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. గ‌తంలో తమిళ‌నాడు ప్ర‌భుత్వంలో జ‌.య‌ల‌లిత ఏంచేసిందో అదే చేయాల్సి వ‌స్తుంద‌ని, ఏపీలోనూ.. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ఉద్యోగుల‌పై చ‌ర్య‌లు తీసుకున్నార‌ని.. తాము కూడా అదే ప‌నిచేయాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. ఇవి.. ఉద్య‌మాన్ని మ‌రింత తీవ్ర‌త‌రం చేస్తాయ‌ని వైసీపీ నాయ‌కులే భ‌య‌ప‌డుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మ‌రి ఇలా నాయ‌కులు నోరు పారేసుకోవ‌డం స‌మంజ‌స‌మేనా?అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: