కేంద్ర బడ్జెట్‌ పై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన విమర్శలు ఇప్పుడు కొత్త వివాదానికి దారి తీస్తున్నాయి. బడ్జెట్ విషయంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ కేసీఆర్‌ తీవ్రవ్యాఖ్యలు చేశారు. దేశంలో అతిపెద్ద మార్పు రావాల్సి ఉందన్న కేసీఆర్‌ ఈ దేశానికి కొత్త రాజ్యాగం రావాల్సి ఉందన్నారు. దీని కోసం త్వరలో తప్పకుండా ఉద్యమిస్తామన్న కేసీఆర్.. భారత్‌లో పరివర్తన తీసుకొచ్చేందుకు నా వంతు పాత్ర పోషిస్తానన్నారు.


అయితే.. ఇప్పుడు కేసీఆర్ చేసిన ఈ కొత్త రాజ్యాంగం వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. కొందరు బీజేపీ నేతలు ఈ వ్యాఖ్యలను అంబేడ్కర్‌కు అవమానంగా చిత్రీకరిస్తున్నారు. సీఎం కేసీఆర్ దాదాసాహెబ్ అంబేడ్కర్ ను అవమానించారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అంటున్నారు. కేసీఆర్ రాజ్యాంగాన్ని తిరిగి రాయాలంటున్నారని.. అంటే సీఎం కేసీఆర్ ఏం కోరుకుంటున్నారు..? రాజ్యాంగం విషయంలో వివాదాస్పదంగా ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు.


సీఎం కేసీఆర్ డిప్రెషన్ లో ఉన్నారని.. ప్రజల కోసం, రైతుల కోసం బడ్జెట్ ఇస్తే సీఎం కేసీఆర్ కు నచ్చదని బండి సంజయ్ విమర్శించారు. ఈ బడ్జెట్‌లో ధాన్యం గోధుమలు, కొనేందుకు కొనేందుకు 2లక్షల 37వేల కోట్లు బడ్జెట్ లో కేటాయించారని.. కానీ.. ధాన్యం కొనను అని తేల్చి చెప్పిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న బండి సంజయ్ ముందు రాష్ట్రంలో సరిగా పాలన చేయాలని సూచించారు.


ఇప్పుడు కేసీఆర్ చేసిన ఈ కొత్త రాజ్యాంగం వ్యాఖ్యలు మరో కొత్త వివాదానికి దారి తీస్తాయా.. అందులో పెద్దగా వివాదం లేకపోయినా బీజేపీ దాన్ని వివాదంగా మారుస్తుందా.. రాజ్యాంగాన్ని వ్యతిరేకించడం ద్వారా కేసీఆర్ అంబేడ్కర్‌ను వ్యతిరేకిస్తున్నారని ప్రచారం చేస్తారా.. దీన్ని టీఆర్‌ఎస్‌ నేతలు ఎలా తిప్పికొడతారన్నది చూడాలి. కొత్త రాజ్యాంగం కావాలని కోరటం అంటే అందులో మార్పులు కోరకడమేనని.. రాజ్యాంగ సవరణ అన్నది రాజ్యాంగం ఆమోదించిన ప్రక్రియ అని టీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: