ఏపీ రాజధాని ఏది.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. 2014 వరకూ హైదరాబాద్ రాజధానిగా ఉండేది.. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ తెలంగాణకు రాజధాని అయ్యింది.. ఏపీకి కొత్త రాజధాని వెదుక్కోవాల్సి వచ్చింది. అందుకే.. పదేళ్ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచారు. అంటే టెక్నికల్‌గా మరో రెండేళ్ల పాటు హైదరాబాద్‌ ను ఆంధ్రప్రదేశ్ తమ రాజధానిగా వాడుకోవచ్చు. కానీ.. ఆంధ్రప్రదేశ్‌ మా రాజధాని మేం చూసుకుంటాం అంటూ హైదరాబాద్‌ నుంచి వెళ్లిపోయింది. చంద్రబాబు హయాంలో అమరావతి రాజధాని అంటూ ప్రకటించారు.


ప్రకటించడమేనా.. ప్రపంచంలోనే అత్యద్భుత రాజధాని కడతామంటూ చంద్రబాబు గ్రాఫిక్స్‌తో ఏళ్లతరబడి సినిమా చూపించారు. అయితే.. చంద్రబాబు ఓడిపోయాక జగన్ సీఎంగా వచ్చాక ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అమరావతిని పక్కన పెట్టేశారు. ఆ తర్వాత మూడు రాజధానుల ఫార్ములా తీసుకొచ్చారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించారు. అయితే.. ఆ మూడు రాజధానుల బిల్లును ఇప్పుడు ప్రభుత్వం మళ్లీ వెనక్కు తీసుకుంది. అంటే.. ఇప్పుడు ఏపీ రాజధాని టెక్నికల్‌గా అమరావతే అన్నమాట.


కానీ ప్రభుత్వం ఈవిషయం చెప్పేందుకు సిద్ధంగా లేదు. అందుకేనేమో పిల్లల పాఠ్యపుస్తకాల్లో రాజధాని అంశం ప్రస్తావించడం లేదట. ఏపీ రాజధాని అంశంపై జగన్ విద్యార్థుల్లో గందరగోళం సృష్టిస్తున్నారని సీపీఐ ఆరోపిస్తోంది. నాలుగో తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు ఇవ్వకపోవటం దుర్మార్గం అంటున్నారు ఆ పార్టీ కార్యదర్శి రామకృష్ణ.. కేంద్ర ప్రభుత్వం అమరావతినే రాజధానిగా గుర్తించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకపోవడం విచారకరం అంటున్నారాయన.


దేశ చరిత్రలో రాజధానిలేని రాష్ట్రంగా ఏపీని చేసిన ఏకైక ప్రభుత్వం జగన్ సర్కారేనని.. అమరావతి రాజధాని ప్రాంత భూములను తాకట్టుపెట్టడంలో ఉన్న శ్రద్ధ, విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లో ముద్రించడంలో లేదెందుకు అని రామకృష్ణ ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ప్రశ్నకు సీఎం జగన్ సమాధానం చెప్పగలరా.. లేదా.. అన్నది తేలాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: