రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ కాంగ్రెస్‌లో చేరబోతున్నారన్న సంగతి తెలిసిందే. ఆయన ఇటీవల కాంగ్రెస్ పెద్దలను కలిసి.. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం కొన్ని వ్యూహాలు వివరించారు. ఏఏ పార్టీలతో ఎలా వ్యవహరిస్తే మళ్లీ కాంగ్రెస్‌కు వైభవం వస్తుందో వివరించారు. ఆ ప్లాన్ లో తెలుగు రాష్ట్రాల్లో ఏ వ్యూహంతో వెళ్లాలో కూడా సూచించినట్టు తెలుస్తోంది. ఈ వ్యూహం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీతో పొత్తు పెట్టుకోవాలని ప్రశాంత్ కిషోర్‌ సోనియాకు సూచించినట్టు తెలుస్తోంది.


ఏపీలో జగన్‌తో పొత్తు కావాలన్న పీకే.. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాలని సూచించారు. ప్రశాంత్ కిషోర్‌ కాంగ్రెస్‌ అధిష్ఠానానికి ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ వివరాలు ఇప్పుడు వెల్లడయ్యాయి. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలంటే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 17 రాష్ట్రాల్లోని 358 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేయాలని ప్రశాంత్‌ కిశోర్‌  అంటున్నారు.  ఈ వ్యూహం ప్రకారం ఏ రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో కూడా ఓ రూట్ మ్యాప్ రెడీ చేశారు.


ప్రశాంత్ కిషోర్ వ్యూహం ప్రకారం తమిళనాడులో డీఎంకేతో కాంగ్రెస్ జట్టు కట్టాలట. అలాగే  మహారాష్ట్రలో ఎన్సీపీతో, పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలట.  ఝార్ఖండ్‌లో జేఎంఎంతో పొత్తు మేలని ప్రశాంత్‌ కిశోర్‌ ప్రపోజ్ చేశారు. అలాగే జమ్మూ-కశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌తో ఈశాన్య రాష్ట్రాల్లో అక్కడి భాగస్వామ్య పార్టీలతో ఎన్నికలకు వెళ్లాలని సూచిస్తున్నాడు ప్రశాంత్ కిషోర్.


బీజేపీతో డైరెక్ట్‌గా తలపడే రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీచేయాలని.. మిగిలిన చోట్ల మాత్రం అక్కడి విపక్షాలతో వ్యూహాత్మక పొత్తులు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఇలా గెలుపే లక్ష్యంగా  కాంగ్రెస్ ఎక్కడికక్కడ వ్యూహం రచిస్తే.. పార్టీ విజయావకాశాలు గణనీయంగా మెరుగవుతాయని ప్రశాంత్ కిషోర్‌ చెబుతున్నారు. ఈ మేరకు ప్రశాంత్‌ కిషోర్.. ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారట. ఈ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ ఓడించడం  ఖాయం అని ప్రశాంత్ కిషోర్ నమ్మకంగా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: