చంద్రబాబు.. దేశంలోనే సీనియర్ నాయకుడిని అని చెప్పుకుంటారు. ఆయన 1996లోనే మోడీ కంటే ముందే ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పి.. ప్రధాన మంత్రులను నియమించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఇందులో ఏదీ అసత్యం లేదు. కానీ.. అంతటి సీనియర్ నాయకుడు.. ఇప్పుడు పార్టీని నడుపుతున్న తీరు.. రాజకీయాలు చేస్తున్న తీరు చూస్తే ఆశ్చర్యం కలగకమానదు.


ఈ ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తే జగన్‌ను ఎదుర్కోవడం కష్టం అన్న విషయాన్ని త్వరగానే చంద్రబాబు గ్రహించారు. అంత వరకూ ఓకే. కానీ.. ఏ పార్టీతో పొత్తుకు వెళ్లాలి.. వెళ్తే వ్యూహం ఏంటి అన్న విషయంపై మాత్రం ఆయన ప్లాన్‌లు అన్నీ అంత సులభంగా కార్యరూపం దాల్చట్లేదు. జనసేనతో పొత్తు పెట్టుకుందామని చంద్రబాబు ముందుగానే భావించారు. ఆ మేరకు సంకేతాలు పంపారు. అటు నుంచి పవన్ కల్యాణ్‌ కూడా ఒంటరిగా గత అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి దారుణంగా భంగపడ్డారు కాబట్టి.. ఆయన కూడా పొత్తుకు ఓకే అనుకున్నారు.


ఈ పొత్తులపై ఏకాభిప్రాయం వచ్చి చాన్నాళ్లే అయ్యింది. అయితే..  పొత్తు విధివిధానాలు, సీట్ల పంపకంపై మాత్రం ఇద్దరు నేతలు త్వరగా ఓ అవగాహనకు రాలేకపోయారు. నాన్చుడు ధోరణి కొనసాగించారు. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేవి పొత్తులే కాదు.. ఆ పొత్తులు ఎంత చక్కగా పార్టీలను సమన్వయం చేస్తాయో అన్న విషయమే కీలకం. ఆ విషయంలో మాత్రం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ విజయవంతం కాలేకపోయారు.


పొత్తులకు వెళ్దామని ఎంతో ముందుగానే అనుకున్నా.. సీట్ల విషయంలో క్లారిటీకి రావడం.. ఏ సీట్లు ఎవరు తీసుకోవాలి అనే విషయాలపై ఏకాభిప్రాయానికి రావకపోవడం.. త్యాగం చేయాల్సిన చోట్ల ఇరు పార్టీలను తమ నాయకులను సిద్ధం చేయకపోవడం వంటి కారణాలతో పొత్తుల రాజకీయం అంత సజావుగా సాగట్లేదు. పవన్‌ కల్యాణ్‌ తీసుకున్నదే అతి తక్కువగా 21 సీట్లు.. కానీ.. ఆ 21 సీట్లలోనూ టీడీపీ అసమ్మతులు బాగా వినిపిస్తున్నాయి. మరి ఇన్నాళ్లూ ఈ ఇద్దరు నేతలు ఏం చేసినట్టు.. పార్టీ నాయకులను ముందుగానే ఎందుకు సిద్ధం చేసుకోనట్టు.. పవన్‌ కల్యాణ్‌ సరే.. కొత్తవాడు.. 40 ఏళ్ల చంద్రబాబు సీనియారిటీ ఎందుకు పనికొచ్చినట్టు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: