మంత్రి రోజా మరోసారి నగరి బరిలో దిగారు. వరుసగా మూడోసారి గెలిచేందుకు ఊవ్విళ్లూరు తున్నారు. ఆమె ఇక్కడ గతంలో టీడీపీ తరపున పోటీ చేయడం ద్వారా అసెంబ్లీ యుద్ధంలో దిగారు. మొదటిసారి ఓటమి చవి చూశారు. ఆ తర్వాత మరోసారి కూడా టీడీపీ నుంచే బరిలో దిగి రెండోసారి కూడా ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో రోజా టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి.. మళ్లీ నగరిలో పోటీ చేసి.. మూడో ప్రయత్నంలో విజయం సాధించారు. అయితే కేవలం 700 పైచిలుకు ఓట్లతోనే ఆమె గట్టెక్కారు.


ఇక 2019లో రాష్ట్రమంతటా జగన్ వేవ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అంతటి వేవ్‌లోనూ రోజా కేవలం 2 వేల పైచిలుకు ఓట్ల స్వల్ప తేడాతోనే గెలిచారు. ఇక ఇప్పుడు మంత్రిగా ముచ్చటగా మూడోసారి వైసీపీ నుంచి హ్యాట్రిక్‌ కొట్టాలని రోజా భావిస్తున్నారు. జగన్ సీఎం అవగానే రోజాకు మంత్రి పదవి వస్తుందని అనుకున్నా.. సామాజిక వర్గ సమీకరణాల రీత్యా  పదవి రాలేదు. అయితే ప్రక్షాళనలో భాగంగా రోజాకు మంత్రి పదవి దక్కింది.


కానీ.. మంత్రి అయ్యాక రోజా పెత్తనం బాగా పెరిగిందని.. ఆమె, ఆమె సోదరులు, భర్త అవినీతికి పాల్పడుతున్నారన్న విమర్శలు బాగా వచ్చాయి. దీనికి తోడు రోజా మంత్రి అయినా నగరి నియోజకవర్గ అభివృద్ధికి పెద్దగా చేసిందేమీ లేదన్న వాదన ఉంది. ఈసారి రోజాకు టికెట్‌ ఇవ్వొద్దని సొంత పార్టీ నుంచే నగరి నేతలు ఏకంగా సీఎం జగన్‌ వద్దకు వెళ్లి మరీ మొరపెట్టుకున్నారు. రోజాకు మళ్లీ టిక్కెట్‌ ఇవ్వొద్దని చక్రపాణి రెడ్డి, ఈడిగ కార్పొరేషన్ ఛైర్మన్ శాంత దంపతులు, మెజారిటీ స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా  గళం కలిపారు.


సీఎం జగన్ మాత్రం రోజాకే మళ్లీ టిక్కెట్‌ కేటాయించారు. మరోవైపు రోజా ప్రత్యర్థిగా మరోసారి గాలి కుటుంబమే బరిలో నిలిచింది. రోజా గతంలో గాలి ముద్దుకృష్ణమ నాయుడిపై, ఆయన కుమారుడు గాలి భానుప్రకాశ్‌ నాయుడిపై గెలిచారు. మరోసారి ఇప్పుడు గాలి భానుప్రకాశ్‌ రోజాకు ప్రత్యర్థిగా బరిలో దిగుతున్నారు. నగరిలో గాలి కుటుంబంపై ఇప్పుడు సానుభూతి పని చేసే అవకాశం కనిపిస్తోంది. దీనికితోడు రోజాను ఓడించాలని గత ఎన్నికల్లోనే మంత్రి పెద్దిరెడ్డి ప్రయత్నించాడని చెబుతారు. మరోసారి అలాంటి ప్రయత్నం కూడా జరొగచ్చు. ఏదేమైనా ఈసారి నగరిలో రోజాకు కష్టకాలమే అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: