నాపై రాళ్ల వేయండి పరవాలేదు.. వాటితో నేను దుర్గం నిర్మించుకుంటాను.. అన్నాడో ఆశావాహవాది. అది పాజిటివ్‌ మనస్తత్వం గురించి చెప్పేందుకు ఈ నానుడిని తరచూ ప్రస్తావిస్తుంటారు. గులకరాయే కదా అన్ని కొన్నిసార్లు తీసిపారేయలేం. ఎందుకంటే.. క్రైస్తవ కథల్లో డేవిడ్‌ అనే కుర్రాడు..గోలియత్‌ అనే రాక్షసుడిని ఓ చిన్న గులకరాయితోనే ఉండేలు దెబ్బతో నేలకూలుస్తాడు. అదీ గులకరాయి పవర్.. ఆ రాళ్ల సంగేతేమో కానీ ఇప్పుడు ఏపీలో రాళ్ల రాజకీయం నడుస్తోంది.


మొన్న జగన్‌ విజయవాడ పర్యటనలో ఎవరో రాయి బలంగా విసరడంతో ఆయన కంటిపైన గాయం అయ్యింది. ఆయనతో పాటు వెల్లంపల్లి కంటికీ గాయమైంది. దీంతో ఒక్కసారిగా ఏపీ పొలిటికల్‌ సీన్‌ రాళ్ల రాజకీయంగా మారిపోయింది. సాధారణంగా ఇది చిన్న ఘటనే. భద్రతావైఫల్యమే. మరింత కట్టుదిట్టంగా సీఎం భద్రత ఏర్పాటు చేస్తే సరిపోతుంది. కానీ అక్కడే మొదలైంది ఆంధ్రా రాజకీయం. దీన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని వైసీపీ ఆరాటపడితే.. ఎక్కడ జగన్‌కు మైలేజీ వస్తుందోనని అంత కంటే దారుణంగా కోడికత్తి 2.0 అనే ప్రచారంతో సోషల్ మీడియాను హోరెత్తించింది టీడీపీ సోషల్ మీడియా.


అసలు విసిరింది రాయి కాదు.. ఎయిర్‌ గన్‌తో దాడి జరిగింది.. ఆయన్ను చంపడమే వారి ధ్యేయం అని వైసీపీ నాయకులు రెచ్చిపోతే.. ఆ దాడి వైసీపీ వాళ్లే చేయించుకున్నారని టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. అంతే కాదు.. అసలు అది  రాయి దాడి కాదు.. అంతకు ముందు గజమాల వేసినప్పుడు తగిలిన గాయాన్ని రాయి దాడి చేయించి సీన్‌ క్రియేట్‌ చేస్తున్నారనిపించేలా టీడీపీ సానుభూతి మేధావులు విశ్లేషణా వీడియోలు హోరెత్తించారు.


అంతటితో ఆగిందా.. ఇంకా జగన్‌కు మైలేజీ వస్తుందన్న బెంగో ఏమో.. లేదా ఆకతాయిల పనో ఏమో కానీ.. చంద్రబాబు, పవన్‌ సభల్లోనూ రాళ్ల దాడులు కలకలం రేపాయి. రాళ్లు మీ జగన్‌కేనా.. మాపైనా పడతాయని చెప్పదలచుకున్నారో.. లేక.. జగన్‌ పై దాడి ఇష్యూని డైల్యూట్‌  చేయాలనుకున్నారో.. లేకపోతే.. జగన్‌ పై రాయి దాడితో స్పూర్తి పొంది ఏ ఆకతాయిలు రెచ్చిపోయారో కానీ.. జగన్, పవన్‌లపైనా రాళ్లు పడ్డాయి. అయితే అవేమీ వాళ్లకు తగల్లేదు కానీ.. చంద్రబాబుపైనా రాయి దాడి..  పవన్‌ పైనా రాయి దాడి అని వార్తలు చక్కర్లు కొట్టేందుకు పనికొచ్చాయి.


ఇక మరోవారం పాటు ఏపీలో ఈ రాళ్ల రాజకీయమే నడుస్తుంది. అంతే తప్ప.. ఎన్నికల ప్రణాళికలపైనా.. జనం సమస్యలపై హామీలపైనా.. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాం.. అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అన్న అంశాలపై చర్చ కాకుండా రాళ్ల దాడి.. రహస్యాలు అంటూ ఇదే అంశంపై చర్చలు సాగుతాయి. ఇదీ ఆంధ్రా రాళ్ల రాజకీయంలో రాజనీతి.

మరింత సమాచారం తెలుసుకోండి: