ఏపీలో రాళ్ల రాజకీయాలు నడుస్తున్నాయి. మొన్నటి జగన్ పర్యటనలో రాయి దాడితో జగన్‌ కన్నుపై బలమైన గాయం తగిలిన సంగతి తెలిసిందే. అయితే ఈ రాళ్ల దాడి ఘటన విషయంపై స్పందించడంతో ఏపీలోని రాజకీయ పార్టీలు తమ అసలు నైజాన్ని బయటపెట్టుకున్నాయి. జరిగిన సంఘటన భద్రత కోణంలో చూడకుండా.. పూర్తిగా రాజకీయ కోణంలోనే చూడటం ప్రారంభించాయి.


ఈ ఘటనతో కొంపదీసి జగన్‌కు పొలిటికల్ మైలేజీ పెరిగిపోతుందా అన్న ఆందోళన టీడీపీ శిబిరంలో కనిపిస్తే.. ఈ రాయి దెబ్బతో తమ పార్టీపై సానుభూతి ఖాయమన్న ధీమా వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. అయితే అసలు ఈ రాయి దాడి వెనుక ఏం జరిగింది.. అసలు జగన్‌పై పడింది రాయేనా.. ఇంకా ఏదైనా వస్తువా.. రాయి చేత్తో విసిరారా.. లేదా.. ఏదైనా ఎయిర్‌ గన్‌ వంటి పరికరాన్ని వాడారా.. అసలు ఈ దాడి ప్రత్యర్థులు జరిపారా.. లేక వైసీపీ వాళ్లే సానుభూతి కోసం ప్లాన్‌ చేశారా అన్న చర్చ ఏపీ అంతటా సాగింది.


అయితే.. గత ఎన్నికల ముందు కోడికత్తి ఘటన జరగడం.. ఈ ఎన్నికల ముందు రాయి దాడి జరగడాన్ని ప్రస్తావిస్తూ టీడీపీ నేతలు ఇది చేయించుకున్న దాడిగా చెబుతున్నారు. అయితే.. సీఎం జగన్‌ తరచూ ప్రజలతో అనేక సమావేశాల్లో ఓ మాట చెబుతుంటారు.. నేను నమ్ముకున్నది పైన ఉన్న ఆ దేవుడిని.. మిమ్మల్నే అంటుంటారు. ఇప్పుడు ఈ ఘటన జరిగింది సాక్షాత్తూ కనకదుర్గ అమ్మవారి సమక్షంలో.. అమ్మవారు కొలువుదీరిన విజయవాడలో.


ఇప్పటికే విజయవాడ నగరం బ్రాండ్‌ ఇమేజ్‌ క్రమంగా మసకబారుతోంది. విజయవాడలో ఏం జరిగినా అది కొన్ని సామాజిక వర్గాల మధ్య యుద్ధంగా మారుతోంది. బెజవాడ రాజకీయం కుల రాజకీయంగా మారిపోతోంది. మరి ఈ ఘటనలో అసలు ఏం జరిగింది.. ఎవరు దాడి చేశారు.. ఎవరు నాటకమాడారు అన్నీ ఆ అమ్మ చూసే ఉంటుంది. తన సమక్షంలో జరిగిన ఈ ఘటనకు పర్యవసానాన్ని ఆమె తప్పకుండా రూపొందిస్తుందని ఆశిద్దాం.  

మరింత సమాచారం తెలుసుకోండి: