కుప్పం.. చంద్రబాబు కంచుకోట. ఇక్కడి నుంచి చంద్రబాబుకు ఓటమి అన్నదే లేదు. 1989 నుంచి కుప్పం నియోజక వర్గానికి చంద్రబాబే ఎమ్మెల్యే.. అధికారంలో ఉన్నా.. లేకపోయినా కుప్పం ఎమ్మెల్యే అంటే చంద్రబాబే. మరి అలాంటి చంద్రబాబు కంచుకోట కుప్పంలో తాజా పరిస్థితి ఏంటి.. అక్కడ చంద్రబాబు మరోసారి ఏకపక్షంగా గెలవబోతున్నారా.. కుప్పంలో వైసీపీ ప్రభావం ఏమేరకు ఉంది అనే అంశాలపై ఇండియా హెరాల్డ్ గ్రౌండ్‌ రిపోర్ట్‌ చూద్దాం..


కుప్పం.. చంద్రబాబు కంచుకోట అయినా.. కొన్ని చేదునిజాలు చెప్పుకోవాలి. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నాడంటే అందుకు కారణం కుప్పమే..కానీ అదే చంద్రబాబు అంత సుదీర్ఘ కాలం సీఎంగా ఉన్నా కుప్పానికి చేసింది పెద్దగా ఏమీ లేదనే చెప్పాలి. అంటే చంద్రబాబు కుప్పానికి ఏమీ చేయలేదని కాదు.. కానీ.. ఓ సీఎం అభ్యర్థి స్థానంలో జరగాల్సినంత అభివృద్ధి మాత్రం కుప్పంలో కనిపించదు. బాలయ్య హిందూపురాన్ని చేసినట్టుగానో.. జగన్ పులివెందులపై ఫోకస్‌ పెట్టినట్టుగానో.. సిద్దిపేట, సిరిసిల్లలను హరీశ్‌రావు, కేటీఆర్‌ అభివృద్ధి చేసుకున్నట్టుగానో కుప్పం ఏమాత్రం కనిపించదు.


ఇక కుప్పంలో యువతరానికి పాత తరం నాయకుడైన చంద్రబాబు అంతగా ఆకట్టుకోవట్లేదనే చెప్పాలి. కొత్త జనరేషన్‌లో చంద్రబాబుపై అంత ఆసక్తి లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు  మెజార్టీ 30 వేలకు పడిపోవడానికి కారణం కూడా అదే. ఇక గత ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకున్న తర్వాత జగన్ కుప్పంలో చంద్రబాబును కొట్టాలని చాలా ప్లాన్‌ చేశారు. ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టి ఆ బాధ్యతలను చంద్రబాబు చిరకాల ప్రత్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల్లో పెట్టారు.


జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని పెద్దిరెడ్డి కూడా బాగానే నిలబెట్టుకున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ ఘోరంగా ఓడిపోవడమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. వైసీపీ అధికారంలోకి వచ్చాక జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయింది. ఎలాగైనా కుప్పంలో చంద్రబాబును ఓడించాలని పట్టుదలతో ఉన్న జగన్.. వైనాట్‌ కుప్పం అన్న నినాదంతో  పార్టీని పరుగులు పెట్టిస్తున్నారు.


అయితే.. ఇప్పటికీ కుప్పం చంద్రబాబు చేతుల్లోనే ఉంది. ఈ ఎన్నికల్లోనూ చంద్రబాబు గెలిచే అవకాశాలే ఉన్నాయి. కాకపోతే ఆ గెలుపు ఏకపక్షం కాదు.. ఏటికి ఎదురీది గెలవాల్సి ఉంటుంది. అంటే కుప్పంలో వార్‌ వన్‌ సైడ్‌ ఏమాత్రం కాదన్నమాట. అనేక సర్వేలు కూడా  ఇదే విషయం స్పష్టం చేస్తున్నాయి. మరి పరిస్థితి ఇంత దారుణంగా ఎందుకు ఉందంటే.. అందుకు బాధ్యత మాత్రం చంద్రబాబుదే. ఇది ఆయన చేతులారా చేసుకున్నదేనంటున్నారు విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: