ఏపీ రాజకీయాల్లో కులాలకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ప్రత్యేకించి కులాల ఆధారంగా ఓట్లు గంపగుత్తుగా పడే అవకాశం ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. ఇక కొన్నాళ్లుగా ఆంధప్రదేశ్‌ రాజకీయాల్లో కమ్మ, రెడ్డి కులాల మధ్య ఉన్న ఆధిపత్య పోరాటం సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏపీలో పరిస్థితి రెండు కులాలు, రెండు పార్టీలు.. ఇంకా చెప్పాలంటే.. ఇద్దరు నాయకుల పోరాటంగా కొన్నేళ్లుగా సాగుతోంది. మరి ఈ ఎన్నికల్లో ఏఏ కులాలు ఏఏ పార్టీలకు వేశాయి. జగన్‌ను గెలిపిస్తున్న పార్టీలు ఏవి.. చూద్దాం..


ఏపీలో వైసీపీపై రెడ్డి కుల ముద్ర, టీడీపీపై కమ్మ కుల ముద్ర ఉన్న విషయం తెలిసిందే. ఎవరు ఎంత కాదన్నా ఈ ముద్ర చెరిపేసేది కాదు. ప్రత్యేకించి ఈ రెండు కులాల్లో కమ్మలు పూర్తిగా టీడీపీవైపే కొన్ని దశాబ్దాలుగా ఉంటున్నారు. కమ్మల స్థాయిలో కాకపోయినా రెడ్డిలు కూడా వైసీపీ వైపు ఉంటున్నారు. ఈసారి కూడా ఇదే తరహా కొనసాగింది. అయితే.. జగన్‌ కమ్మ నేతలకు కూడా కొంత ప్రాధాన్యం ఇవ్వడంతో అతి తక్కువగా అయినా కమ్మల ఓట్లు వైసీపీకి కొన్ని చోట్ల పడ్డాయని ఇండియా హెరాల్డ్ పరిశీలనలో తెలిసింది.


ఈ రెండూ కాకుండా ఏపీ ఎన్నికలను ప్రభావితం చేయగల కులం కాపులు.. కాపులు ఎక్కువగా పవన్‌ కల్యాణ్‌ వెంట ఉంటారన్నది సాధారణమైన అంచనా.. ప్రత్యేకించి కాపు యువత అంతా జనసేనతో ఉంటుందని చాలా మంది భావించారు. అది చాలా వరకూ నిజమే అయినా.. జగన్‌ కూడా చాలామంది కాపులకు తన పార్టీలో ప్రాధాన్యత ఇచ్చారు. కాపులపై చాలా చోట్ల కాపులనే పోటీకి దించారు. ఇలాంటి చోట్ల స్థానిక కాపు నాయకులదే కీలక పాత్ర అయ్యింది. ఈ కారణంగా కాపు ఓటు బ్యాంక్‌ పూర్తిగా జనసేనవైపు వెళ్లిందని చెప్పే పరిస్థితి లేదు. కాపులు యూత్‌ పూర్తిగా కూటమి వైపు ఓటేశారు. అయితే కాపులకూ జగన్  సీట్లు ఇవ్వడం వల్ల.. ముద్రగడ వంటి నేతల వైఖరి కారణంగా కాపు సీనియర్‌ సిటిజన్లు వైసీపీ వైపు మొగ్గారు. ఇది వైసీపీకి  కొంత వరకూ లాభించింది.


ఇక మరో కీలక వర్గమైన ఎస్సీ, ఎస్టీలు పూర్తిగా వైసీపీ వైపు తిరిగారని చెప్పవచ్చు. సాధారణంగా ఈ వర్గాలు మొదటి నుంచి కాంగ్రెస్‌తో.. వైఎస్‌ వచ్చిన తర్వాత ఆయనతో.. ఆ తర్వాత ఆయన వారసత్వంగా జగన్‌తో ఉంటూ వస్తున్నాయి. జగన్ సీఎం అయ్యాక ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల కారణంగా ఈ వర్గాలతో వైసీపీ బంధం మరింతగా పెరిగింది. ఎస్సీ, ఎస్టీల్లో ఉన్న క్రిస్టియానిటీ కారణంగా ఇది మరింతగా బలోపేతమైంది. అందుకే ఈసారి ఎస్సీ, ఎస్టీ ఓట్లు గంపగుత్తగా వైసీపీకే పడ్డాయి.


మరో కీలకమైన ఓటు బ్యాంకు బీసీలు. సాధరాణంగా ఈ వర్గం మొదటి నుంచి టీడీపీకి అనుకూలంగా ఉంటూ వస్తోంది. అయితే.. కొన్నేళ్లుగా జగన్ చేస్తున్న సోషల్ ఇంజినీరింగ్ కారణంగా బీసీలు వైసీపీ వైపు మరలారు. జగన్‌ తన పాలనలో బీసీలకు పెద్ద పీట వేశారు. అటు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పదవులు పంచారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ ఈ వర్గాలను దగ్గర చేసుకున్నారు. అంతే కాదు.. ఈ ఎన్నికల్లో బీసీలకు పెద్ద ఎత్తున టికెట్లు ఇచ్చి బరిలో దింపారు.


జగన్ అనుసరించిన బీసీ అనుకూల విధానం ప్రభావం ఎన్నికల పోలింగ్‌లో స్పష్టంగా కనిపించింది. ఇది టీడీపీకి పెద్ద దెబ్బగా మారింది. ఇక మొదటి నుంచి వైసీపీకి అనుకూలంగా ఉంటూ వస్తున్న మైనార్టీలు చంద్రబాబు అనుసరించిన విధానంతో వైసీపీకి మరింత దగ్గరయ్యారు. బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకోవడంతో.. ఆ పార్టీ వైపు ఉన్న మైనార్టీలు కూడా ఇప్పుడు జగన్‌కు జైకొట్టారు. దీంతో ఈసారి మైనార్టీల ఓట్లు గంపగుత్తుగా వైసీపీకి పడిపోయాయి.  


ఇక బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులు ఓట్లు మాత్రం వైసీపీకి కాస్త దూరమయ్యాయని చెప్పొచ్చు. ఈ ఓట్లు ఎక్కువగా అర్బన్ ప్రాంతాల్లో ఉండటం వల్ల.. వీరు వైసీపీ పట్ల అంత సానుకూలంగా లేరు. దీంతో ఈ వర్గాలలోని మెజార్టీ ఓట్లు కూటమికి పడ్డాయని ఇండియా హెరాల్డ్‌ పరిశీలనలో తెలిసింది. అంతే కాదు.. టీడీపీతో బీజేపీ జట్టుకట్టడం వల్ల హిందూత్వ ప్రభావం కారణంగా ఈ కులాల ఓట్లు బీజేపీ వైపే మొగ్గాయి. ఇది కూటమికి కలసి వచ్చింది.


ఏ ఒక్క కులం ఓట్ల కారణంగా ఏ ఒక్కరూ సీఎం కాలేరు. కానీ సమాజంలో ఎక్కువ కులాల ఆమోదం పొందిన పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు వైసీపీ విషయంలో అదే జరిగింది. జగన్ మొదటి నుంచి అనుసరిస్తున్న సోషల్ ఇంజనీరింగ్ ఫలించింది. వైసీపీలో రెడ్ల ఆధిపత్యం ఉంటుందన్న భావన ఉన్నా.. మిగిలిన మెజార్టీ కులాలను కూడా కలుపుకుపోవడంతో వైసీపీ విజయ దుందుభి మోగించబోతోందని ఇండియా హెరాల్డ్‌ పరిశీలనలో తేలింది. మరి ఓటరు తీర్పు ఏంటో వచ్చేనెల 4న కానీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: