జగన్‌ను నడిపించే ఆ ఏడుగురు..
ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం..
జగన్‌ నిర్ణయాల్లో వీరిది కీలకపాత్ర..

వాళ్లు ఏడుగురు జగన్‌ సైన్యంలో సూత్రధారులు.. ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం. అయినా జగన్ తీసుకునే ప్రతి రాజకీయ నిర్ణయంలోనూ వీరి సలహాలు ఉంటాయి. జగన్‌ తీసుకునే కీలక నిర్ణయాల వెనుక ఈ ఏడుగురి మేధోమధనం ఉంటుంది. జగన్‌ ఎక్కువగా నమ్మే ఆ ఏడుగురు సలహాదారులు స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి, విజ‌య‌సాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అజ‌య్ క‌ల్లామ్, త‌ల‌శిల ర‌ఘురాం, శామ్యూల్‌, సాక్షి ధ‌నుంజ‌య్‌ రెడ్డి. అసలు వీరు ఎవరు.. వీరి నేపథ్యాలు ఏంటి.. వీరి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.


స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి
జగన్‌ కోటరీలోగా జగన్‌ వాయిస్‌గా పేరున్న వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్‌తో సుదీర్ఘకాలంగా కలసి నడుస్తున్న వ్యక్తి. జర్నలిస్టుగా పలు పత్రికల్లో పని చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షి పత్రిక ఏర్పాటైన నాటి నుంచి అందులో కీలకంగా వ్యవహరించారు. వైసీపీ ఏర్పాటైన నాటి నుంచి పార్టీలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక వైసీపీ అఫీషియల్ వాయిస్‌గా మారిపోయారు. సజ్జల చెప్పాడంటే జగన్‌ చెప్పినట్టే అన్న టాక్‌ ఉంది. అందుకే విపక్షాలు అక్కసుతో ఆయన్ను సకలశాఖల మంత్రి అంటూ దెప్పిపొడుస్తుంటారు.


విజయసాయిరెడ్డి
వెనుంబాక విజయసాయిరెడ్డి.. జగన్‌ టీమ్‌లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా చెబుతారు. జగన్‌ రాజకీయాల్లోకి రాకముందు నుంచే ఆయన సంస్థల ఆడిటర్‌గా పని చేసిన విజయసాయిరెడ్డి జగన్‌ ఆర్థిక సామ్రాజ్యాన్ని న్యాయపరమైన చిక్కులు లేకుండా మెయింటైన్‌ చేస్తున్న కీలక వ్యక్తి. అంతే కాదు.. జగన్‌ ఢిల్లీ వ్యవహారాలు చక్కబెట్టగల సమర్థుడిగా కూడా విజయసాయికి పేరుంది. జగన్‌ ఆస్తుల కేసుల్లో జగన్‌తో పాటు జైలుకు కూడా వెళ్లిన చరిత్ర విజయసాయిది. అందుకే జగన్‌ ఆయన్ను ఎంపీని చేశారు. జగన్‌ తర్వాత పార్టీలో నెంబర్‌ టూ అంటూ ఎవరినైనా చెప్పాల్సి వస్తే అది విజయసాయిరెడ్డే అనేంతగా పేరు సంపాదించారు.


వైవీ సుబ్బారెడ్డి
వైవీ సుబ్బారెడ్డి స్వయంగా సీఎం జగన్‌కు బాబాయి అవుతారు. మొదటి నుంచి జగన్‌తో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారు. బంధువు కావడం వల్ల సీఎం జగన్‌ వద్ద ఏ విషయాన్నయినా ప్రస్తావించగలగిన చనువు ఉన్న నేత వైవీ సుబ్బారెడ్డి. జగన్‌ తీసుకునే కీలక నిర్ణయాలను ప్రభావితం చేయగలనేతగా సుబ్బారెడ్డికి పేరుంది. వైసీపీ నుంచి 2014లో ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత టీటీడీ ఛైర్మన్‌గానూ పని చేశారు.


అజ‌య్‌ క‌ల్లామ్
అజ‌య్‌ క‌ల్లామ్ ఓ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి. వైఎస్‌, చంద్రబాబు హయాంలోనూ కీలక పదవులు నిర్వహించారు. అయితే ఈయన రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు అని చాలామందికి తెలియదు. రిటైర్‌మెంట్‌ తర్వాత ఆయన జగన్‌కు నమ్మిన బంటుగా మారారు. అందుకే జగన్‌ ఆయన్ను ఏరికోరి సీఎం ముఖ్య సలహాదారుగా పదవి కట్టబెట్టారు. స్వతాహాగా బ్యూరోక్రాట్‌ కావడంతో ప్రభుత్వ పాలనపై ఆయనకు పట్టు ఉంది. అది జగన్‌ తీసుకునే కీలక నిర్ణయాలకు ఉపకరిస్తుంది.


సాక్షి ధ‌నుంజ‌య్‌ రెడ్డి
ధనుంజయ్‌రెడ్డి యువకుడు. కడప జిల్లాకు చెందిన ధనుంజయ్‌రెడ్డి ఈనాడు జర్నలిస్టుగా తన ప్రస్థానం ప్రారంభించారు. సాక్షి ప్రారంభంతోనే అందులో చేరారు. ఎడ్యుకేషన్‌ డెస్క్‌ బాధ్యతలు చూస్తూనే యాజమాన్యానికి దగ్గరయ్యారు. నమ్మకం చూరగొన్నారు. అందుకే అతి పిన్న వ‌య‌స్సులోనే సాక్షికి రెసిడెంట్ ఎడిట‌ర్‌గా ప్రమోట్ అయ్యారు. నాయ‌కుల‌ను పార్టీకి అనుసంధానం చేయ‌డంలో జ‌గ‌న్‌కు చేదోడు వాదోడుగా ఉంటాడు. జగన్‌కు న‌మ్మిన‌బంటుగా ద‌శాబ్దాలుగా ఉన్నారు. రాజ‌కీయాన్ని బాగా ఆక‌లింపు చేసుకున్న ఈ ధనుంజయ్‌రెడ్డి జగన్‌ టీమ్‌లో యువకుడిగా చెప్పుకోవచ్చు.

తలశిల రఘురాం
తలశిల రఘురాం.. ఈ పేరు పెద్దగా మీడియాలో వినిపించదు. ఆయన టీవీల్లోనూ పెద్దగా కనిపించడు. కానీ జగన్‌ కోటరీలో ఈయన చాలా కీలకమైన వ్యక్తి. జగన్‌కు నమ్మినబంటుగా చెప్పుకోవచ్చు. కృష్ణా జిల్లాకు చెందిన ఈ నేత.. వైఎస్‌ఆర్‌ హయాం నుంచి వైఎస్‌ ఫ్యామిలీకి దగ్గరివాడుగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా 2018లో జగన్‌ నిర్వహించిన సుదీర్ఘ పాదయాత్రను దిగ్విజయంగా సమన్వయం చేసి.. పరోక్షంగా పార్టీ గెలుపులో తనవంతు పాత్ర పోషించారు. ఇప్పటికీ జగన్ కార్యక్రమాల నిర్వహణలో తలశిలదే కీలకపాత్రగా చెబుతారు. జగన్‌ ఆయనకు 2021లో ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు.

శామ్యూల్
జగన్‌ సైన్యంలో మరో కీలక వ్యక్తి శ్యామ్యూల్‌. ఈయన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి. ఎం శామ్యూల్ జగన్‌కి అత్యంత సన్నిహితుడుగా పేరుంది. పదవీ విరమణ తర్వాత ఆయన జగన్‌కు రాజకీయ సలహాదారుడుగా మారారు. జగన్‌ అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన నవరత్నాల హామీల రూపకల్పనలో శ్యామ్యూల్‌దే కీలక పాత్ర అని చెబుతారు. అందుకే జగన్ సీఎం కాగానే శామ్యూల్ కు నవరత్నాల అమలు కార్యక్రమానికి వైఎస్‌ ఛైర్మన్‌గా ను నియమించారు. జగన్‌ ఎక్కువగా నమ్మకం పెట్టుకున్న సంక్షేమపథకాల అమలులో శ్యామ్యూల్‌ కీలక పాత్ర పోషించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: