టీడీపీ ఓడితే పవన్‌కు మంచి భవిష్యత్తు
ఐదేళ్లూ పోరాడితే సీఎం కుర్చీ దక్కే ఛాన్స్‌
టీడీపీ నుంచి జనసేనకు పెరగనున్న వలసలు

ఏపీలో ఎన్నికల ఫలితాలు మరో వారం రోజుల్లో వెలువడబోతున్నాయి. జనం తీర్పు ఇప్పటికే ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. మరి ఆ తీర్పు ఏంటన్నది అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్న ప్రశ్న. అందుకే ఫలితం ఎలా ఉంటే ఏం జరగబోతోంది అన్న అంశంపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి టీడీపీ ఓటమి పాలైతే ఆ పార్టీ పని ఖతమే అన్న వాదనలు ఉన్నాయి. ఇప్పటికే టీడీపీ తన ప్రాభవం కోల్పోయింది. ఈసారి కూడా నెగ్గకపోతే.. ఆ పార్టీ భవితవ్యమే ప్రమాదంలో పడొచ్చు.


టీడీపీ ఇప్పటి వరకూ మనగలిగిందంటే అందుకు ప్రధాన కారణం చంద్రబాబే అన్న విషయం ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. అలాంటి చంద్రబాబుకు వయస్సు మీద పడుతోంది. ఇప్పటికే 75 ఏళ్లు దాటాయి. 2029 అంటే అప్పటికి ఆయనకు 80 ఏళ్లు వస్తాయి. మరోవైపు ఈసారి కూడా ఓడిపోతే.. ఇప్పటికే ఒకసారి ఓడిన నారా లోకేశ్‌ పార్టీని నడిపించడం కష్టం అవుతుంది. ఆయన నాయకత్వంపై పార్టీలోనూ అనుమానాలు తలెత్తుతాయి.


ఇదే సమయంలో ప్రత్యామ్నాయంగా జనసేన ఆవిర్భవిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఏపీలో ఇప్పటి వరకూ టీడీపీ, వైసీపీ చెరోసారి అధికారం దక్కించుకున్నాయి. ఇప్పుడు మరోసారి వైసీపీ నెగ్గితే వైసీపీ పదేళ్లు, టీడీపీ ఐదేళ్లు పాలించినట్టు అవుతుంది. జనాన్ని ఆకట్టుకోవడంలో టీడీపీ విఫలం కావడం వల్ల.. ప్రత్యామ్నాయ విపక్షంగా జనసేనకు అవకాశం దక్కుతుంది. ఈఎన్నికల్లో కూటమికి అధికారం దక్కకపోయినా జనసేన ఓ పది వరకూ అసెంబ్లీ సీట్లు దక్కించుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి.


ఉన్న పది మంది ఎమ్మెల్యేలతో పవన్‌ కల్యాణ్‌ జనంలో తిరిగి.. ప్రజా సమస్యలపై పోరాడితే ప్రజల విశ్వాసం దక్కించుకుంటారు. 2029 నాటికి జగన్‌ పదేళ్ల పాలన కూడా పూర్తవుతుంది కాబట్టి.. ప్రభుత్వ వ్యతిరేకత బాగా పెరుగుతుంది. నాయకత్వలేమితో ఇబ్బంది పడుతున్న టీడీపీ నేతలు అప్పుడు జనసేన వైపు చూస్తారు. అలా టీడీపీ పూర్తిగా బలహీన పడి జనసేన బలమైన విపక్షంగా తయారవుతుంది. 2029 నాటికి జనసేన తన బలం పెంచుకుంటే.. అధికారం దక్కించుకునే అవకాశం ఉందన్నది విశ్లేషకుల మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: