ప్రజాస్వామ్యంలో అధికారం నీటి బుడగ. ఎవరు అధికారంలోకి రావాలి. ఎవరు ప్రతిపక్షానికి పరిమితం అవ్వాలనేది ప్రజలే నిర్ణయిస్తారు.  ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పాటు అయింది.  వైసీపీని గద్దె దించిన ప్రజలు.. టీడీపీ కూటమిని అధికార పీటమెక్కించారు. సహజంగా ఎవరు అధికారంలో ఉంటే వారి మార్క్ ఉండేలా ఆయా నాయకులు ఆరాట పడుతుంటారు. ప్రతి దానికి తమ పేరు ఉండాలని వారు భావిస్తుంటారు.  ప్రస్తుతం పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు అమలు అవుతున్న పథకాలపై మాజీ సీఎం జగన్ ఫొటోలు తీసేశారు.  


గతంలో ఏ ప్రభుత్వం చేయని ప్రచార ఆర్భాటం గత వైసీపీ ప్రభుత్వం చేసింది.  పిల్లలకిచ్చే చిక్కీపై సైతం జగన్ బొమ్మ వేయించడం అప్పట్లో సర్వత్రా విమర్శలొచ్చాయి. అలాగే ప్రతి పథకానికి ముందు జగనన్న.. ఆ తర్వాత జగనన్న పేర్లు చేర్చడం మనం చూశాం. తాజాగా కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో జగన్ పేర్లను ఒక్కొక్కటిగా తొలగిస్తూ వస్తోంది.


జగనన్న గోరుముద్ద పథకంలో గతంలో అమల్లో ఉన్న విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకంలో కొత్త ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ పథకం పేరు నుంచి జగనన్న అనే పేరును తొలగించారు.  ఇక నుంచి కేవలం పీఎం పోషణ్ గోరుముద్దగా దీనిని పిలవనున్నారు. ఈ పథకంలో భాగంగా విద్యార్థులకు ఆదివారం మినహా ఆరు రోజులు గుడ్డు, చిక్కీలతో కూడిన పౌష్టికాహారాన్ని అందజేస్తారు.


వ్యూహాత్మకంగా జగన్ పేరును తొలగించి ప్రధాని పేరును చేర్చారు. కొత్త సీఎం చంద్రబాబు ఈ మొత్తం పథకంపై జగన్ బ్రాండింగ్ తీసివేసి దానికి టీడీపీ రంగు వేయడానికి బదుల, ప్రధాని పేరు పెట్టడం ద్వారా మరింత సాధారణ ముద్ర వేశారు. వాస్తవానికి ఈ పథకంలో సింహభాగం నిధులను కేంద్రమే అందిస్తోంది.  కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమకు మంచి పేరు రావాలని వారి పేర్లు పెట్టుకొని  అమలు చేస్తూ ఉంటారు.  వాస్తవానికి ఈ పథకానికి పీఎం పోషణ్ గోరుముద్ద సముచితమైందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: