ఎన్నికలు వస్తే చాలు అధికారమే పరమావధిగా నాయకులు పలు హామీలు ఇస్తుంటారు. తీరా అధికారం చేజిక్కిన తర్వాత వాటిని అమలు చేసేందుకు నానా ప్రయాసలు పడుతుంటారు.  ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో ప్రజల్లోకి వెళ్లి విజయం సాధించింది.  ఇందులో ముఖ్యమైనవి రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి పలు  హామీలు ఉన్నాయి.


మిగతా హామీలు అమలవుతున్నా రైతులకు రూ.2లక్షల రుణమాఫీ మాత్రం అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల సమయంలో ఆగష్టు 15 లోపు ఎట్టి పరిస్థితుల్లో రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతానని సీఎం రేవంత్ రెడ్డి పలు సభల్లో ఆయా దేవాలయాలపై ప్రమాణం కూడా చేశారు.


ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసింది. దీంతో నిధుల సమీకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా భూముల మార్కెట్ విలువను అమాంతం పెంచి రిజిస్ర్టేషన్ ఛార్జీలను పెంచేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రెండేళ్ల క్రితం పెరిగిన రిజిస్ర్టేషన్ విలువను మళ్లీ పెంచి ఏడాదికి రూ.20వేల కోట్లు ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది.


ఇప్పుడు మార్కెట్ విలువ పెంచితే ఏం జరుగుతుందో అంటే.. ఒక ఏరియాలో ఒక గజం భూమి విలువ గవర్నమెంట్ లెక్కల ప్రకారం సుమారు రూ.25వేలు ఉంటే.. దానిని రూ.30-40వేల మధ్యకు పెంచుతారు. దీని ద్వారా ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరుతుంది.  కానీ ఈ ప్రయత్నం వికటిస్తే.. ఎందుకంటే ఆంధ్రాలో మాజీ సీఎం జగన్ ఇదే ఫార్ములా అనుసరించి దెబ్బతిన్నారు.

ఏపీలో మొత్తం మూడు నుంచి నాలుగు సార్లు భూమి ధరలను సవరించారు. రికార్డుల్లో భూమి ధరల పెరిగాయి కానీ.. అక్కడి స్థానికంగా స్థలాల రేట్లు పెరగలేదు. ఇప్పుడు తెలంగాణలో అలాంటి పరిస్థితులే వస్తే ప్రజలు తిరస్కరించే అవకాశం ఉంటుంది. వ్యాపారులు, రిజిస్ర్టేషన్ చేయించుకునే వ్యక్తుల వరకు వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. నిజంగా భూమి ధరలు పెరిగే అవకాశం ఉన్న చోట దీనిని అమలు చేస్తే బావుంటుంది అని పలువురు సూచిస్తున్నారు. అలా కాకుండా తెలంగాణ అంతటా పెంచితే రియల్ ఎస్టేట్ ఢమాల్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: