ఆయన యువ నాయకుడు. తండ్రి అనూహ్య మరణంతో రాజకీయ ప్రవేశం చేసిన గిరిజన బిడ్డ. అయితే, కాలం కలిసి రావడం లేదో లేక.. రాజకీయంగా ఆయనకు లక్కు చెక్కడం లేదో తెలియ‌దు గానీ.. ప్రస్తుతం ఆయన పేరు పెద్దగా వినిపించడం లేదు. ఆయనే కిడారి సర్వేశ్వరరావు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కిడారి శ్రావణ్ కుమార్. 2014లో అరకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కిడారి సర్వేశ్వరరావు వైసీపీ తరఫున విజయం దక్కించుకున్నారు. అయితే గిరిజన సామాజిక వర్గం నుంచి మంత్రి పదవిని ఆశించిన ఆయన తర్వాత కాలంలో టిడిపిలో చేరారు.


అప్పటి టిడిపి ప్రభుత్వంలో మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం కూడా జరిగింది. మంత్రి వర్గ ప్రక్షాళన జరగడానికి కొన్ని నెలల ముందు మావోయిస్టులు జరిపిన కాలపుల్లో కిడారి సర్వేశ్వరరావు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే ఆయన వారసుడిగా శ్రావణ్ కుమార్ రంగ ప్రవేశం చేశారు. 2019 ఎన్నికలకు ఆరు మాసాల ముందు ఆయనను ఎటువంటి ప్రత్యక్ష ఎన్నికలతో సంబంధం లేకుండా నేరుగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మంత్రి పదవిని ఇచ్చారు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో అదే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ కూడా శ్రావణ్‌ దక్కించుకున్నారు.


యువ నాయకుడిగా.. సర్వేశ్వరరావు వారసుడిగా రంగంలోకి దిగిన శ్రావణ్ విజయం దక్కించుకుంటార‌ని అందరూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోవడం గమనార్హం. ఇక గత ఎన్నికల విషయానికి వస్తే అసలు శ్రావణ్ కుమార్ పేరు కూడా ఆ ఎన్నికల్లో వినిపించలేదు. టిడిపి ఏమాత్రం శ్రావణ్ కుమార్ ను పరిగణనలోకి తీసుకోకుండానే ఈ స్థానాన్ని బిజెపికి కేటాయించేసింది. కూటమి భాగస్వామ్య పక్షాలకు కేటాయించిన కొన్ని నియోజకవర్గాల్లో అరకు అసెంబ్లీ స్థానం కూడా ఉండడం విశేషం.


అయితే అప్పటినుంచి శ్రావణ్ కుమార్ సైలెంట్ అయిపోయారు. ఏడాది కాలంగా ఆయన పెద్దగా ఎక్కడ కనిపించడం లేదు. ఆయన పేరు కూడా వినిపించడం లేదు. కానీ తండ్రి వారసత్వాన్ని నిలబెట్టుకుని, ప్రజల్లోకి వెళ్తే గిరిజనుల్లో నమ్మకాన్ని పెంచుకోగలిగితే, విశ్వాసాన్ని పెంచుకోగలిగితే భవిష్యత్తు బాగుంటుందనేది రాజకీయ వర్గాలు చెబుతున్న మాట. అరకు వంటి అసెంబ్లీ స్థానంలో తండ్రి నిలబెట్టుకున్న రాజకీయాలను కొనసాగించి గిరిజనుల మనసును దోచుకునే ప్రయత్నం చేస్తే వచ్చే ఎన్నికల నాటికైనా శ్రావణ్ కుమార్ కు అవకాశం ఉంటుంది.


అయితే ఇదే సమయంలో లక్కు కూడా కలిసి రావాలి. దీని మాట ఎలా ఉన్నా నాయకులను ఏకం చేయడం, పార్టీలో ఉన్న సీనియర్లను కలుపుకొని ముందుకు సాగడం వంటి పరిణామాలు శ్రావణ్‌కు కలిసి వస్తాయని సీనియర్లు చెబుతున్నారు. కానీ ఇప్పటివరకు ఆయన ఆ దిశగా ప్రయత్నం అయితే చేయలేదు. భవిష్యత్తులో అయినా ప్రభుత్వం తరఫున కార్యక్రమాలు నిర్వహించడం, పార్టీ తరపున కార్యక్రమాలు నిర్వహించటం, ప్రజల మధ్యకు వెళ్లడం, వారి సమస్యలు తెలుసుకోవడం వంటి అంశాలకు ఆయన ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా పుంజుకునేందుకు చాలా అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: