అయితే ఇంత చేస్తున్నా కుండెడు పాలలో చిన్న ఉప్పుగల్లులా.. మహిళా ఎమ్మెల్యేల భర్తలు వ్యవహరిస్తున్న తీరు కూటమికి శాపంగా మారుతోంది. కొన్నాళ్ల కిందట గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్రరావు తీవ్రస్థాయిలో మీడియాపై విరుచుకుపడ్డారు. తమపై వ్యతిరేక వార్తలు రాస్తున్నారని, అంతు చూస్తామని ఆయన హెచ్చరించడం అప్పట్లో తీవ్ర వివాదానికి దారితీసింది. దీంతో సీఎం చంద్రబాబు ఆమెను పిలిచి క్లాసు ఇచ్చారు. అంతేకాదు భవిష్యత్తులో ఇలాంటివి జరిగితే ఊరుకోమని కూడా చెప్పారు.
తాజాగా జనసేన పార్టీ ఎమ్మెల్యే భర్త మీడియా ముందు చిందులు తొక్కటం రాజకీయంగా వివాదానికి దారి తీసింది. విజయనగరం జిల్లా నెర్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి.. గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున విజయం దక్కించుకున్నారు. అయితే కూటమిలో ఇతర పార్టీలను కలుపుకుని వెళ్లడంలో ఆమె వెనకబడ్డారు. వివాదాలకు కూడా కారణంగా మారారు అన్నది కూటమిలోనే వచ్చిన విమర్శ. ఇదిలా ఉంటే తాజాగా లోకం మాధవి భర్త లోకం ప్రసాద్ మీడియాకు భారీ వార్నింగ్ ఇచ్చారు. తమ గురించి వార్తలు రాస్తే తాటతీస్తామని బహిరంగంగానే మీడియా ముందు హెచ్చరించారు.
దీంతో అసలు ఏం జరుగుతోంది అన్నది జనసేన పార్టీ ఆరా తీసింది. వాస్తవానికి ఎమ్మెల్యేలకు మాత్రమే అధికారం ఉంటుంది. ఎమ్మెల్యేల భర్తలుగా ఇతరులకు ఎటువంటి అధికారం ఉండదు. కావాలంటే వాళ్ళు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. కానీ, అధికారం ఉపయోగించి పెత్తనం చలయించే అధికారం ఏ ఒక్కరికి లేదు. కానీ ఎమ్మెల్యేల భర్తలు మాత్రం దూకుడు ప్రదర్శించి మీడియాకే వార్నింగ్ ఇచ్చే పరిస్థితి రావడంతో కూటమిలో సంచలనంగా మారుతున్నాయి. ఈ పరిస్థితిని అరికట్టాలన్నది క్షేత్రస్థాయిలో నాయకులు చెబుతున్న మాట. అది కూడా అనుకూల మీడియా పైనే విరుచుకుపడుతుండడం మరింత వివాదానికి దారితీసింది. మరి ఏం చేస్తారో చూడాలి.