
BPA వంటి రసాయనాలు మన ఎండోక్రైన్ వ్యవస్థపై చెడు ప్రభావం చూపుతాయి. ఇది థైరాయిడ్ సమస్యలు, పునరుత్పత్తి సమస్యలు, కొన్ని రకాల క్యాన్సర్లకు దారితీయవచ్చు. ప్లాస్టిక్ బాటిల్స్ ఉపయోగించినప్పుడు వాటి నుండి అతి చిన్న ప్లాస్టిక్ కణాలు నీటిలోకి విడుదలవుతాయి. ఈ కణాలు మన శరీరంలోకి చేరి జీర్ణ వ్యవస్థ మరియు ఇతర అవయవాలను ప్రభావితం చేయొచ్చు. ఈ సూక్ష్మ ప్లాస్టిక్ కణాల వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయనే దానిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.
ప్లాస్టిక్ బాటిల్స్ భూమిలో కలిసిపోవడానికి వేల సంవత్సరాలు పడుతుంది. ఇవి పారవేసిన తర్వాత భూమిలో పేరుకుపోయి నేల కాలుష్యానికి కారణమవుతాయి. ఇది భూమిలోని జీవరాశికి, మొక్కల పెరుగుదలకు హాని చేస్తుంది. ప్లాస్టిక్ వ్యర్థాలు నదులు, సముద్రాలు మరియు సరస్సులలో చేరి నీటిని కలుషితం చేస్తాయి. ఇవి సముద్ర జీవులైన చేపలు, తాబేళ్లు మరియు పక్షులకు హాని కలిగిస్తాయి. అవి ఈ ప్లాస్టిక్ ముక్కలను ఆహారంగా భావించి తిని అనారోగ్యానికి గురవుతాయి లేదా చనిపోతాయి.
చాలా ప్లాస్టిక్ బాటిల్స్ రీసైకిల్ చేయడానికి అనుకూలంగా ఉండవు. రీసైకిల్ చేసినా వాటి నాణ్యత తగ్గిపోతుంది. దీనివల్ల కొత్త ప్లాస్టిక్ ఉత్పత్తిని పూర్తిగా తగ్గించలేం. . ప్లాస్టిక్ బాటిల్స్‌కు బదులుగా స్టెయిన్‌లెస్ స్టీల్, గాజు లేదా రాగి బాటిల్స్‌ను ఉపయోగించడం మంచిది. ఇవి ఆరోగ్యానికి సురక్షితం మాత్రమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి. మనం తీసుకునే చిన్నపాటి జాగ్రత్తలు మన ఆరోగ్యాన్ని, అలాగే భవిష్యత్ తరాల కోసం మన పర్యావరణాన్ని కాపాడటానికి సహాయపడతాయి.