
నిశ్శబ్దంగా ఉండటం వలన ఒత్తిడిని కలిగించే హార్మోన్ల (కార్టిసోల్ వంటివి) ఉత్పత్తి తగ్గి, మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఇది ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యల నుండి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. మౌనం మెదడుకు విశ్రాంతిని ఇస్తుంది. కొంత సమయం పాటు నిశ్శబ్దంగా ఉండటం మెదడులోని కొత్త కణాల అభివృద్ధిని ప్రేరేపించవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
శబ్దాలు లేకపోవడం వల్ల మన దృష్టి, ఏకాగ్రత పెరుగుతాయి. ఏదైనా పనిని సులభంగా, సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతాం. నిశ్శబ్దంగా ఉండటం జ్ఞాపకశక్తిని పెంచడానికి, ఆలోచనలను స్పష్టం చేయడానికి తోడ్పడుతుంది. ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉండటం నిద్రలేమి సమస్యను తగ్గించి, హాయిగా నిద్రపోవడానికి వీలు కల్పిస్తుంది. మౌనం రక్తపోటును తగ్గించి, గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ప్రశాంతత గుండె ఆరోగ్యంగా పనిచేయడానికి సహాయపడుతుంది, రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. మౌనంగా ఉన్నప్పుడు, మనస్సు స్వేచ్ఛగా ఆలోచించడానికి అవకాశం లభిస్తుంది. దీనివల్ల కొత్త ఆలోచనలు, సృజనాత్మకత పెరుగుతాయి. మౌనంగా ఉండేవారు ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినడం నేర్చుకుంటారు. దీనివల్ల కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఆలోచించి, సరైన మాటలు మాట్లాడగలుగుతారు. ప్రశాంతంగా ఆలోచించడం వలన తొందరపాటు లేకుండా, స్పష్టతతో మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. రోజులో కొంత సమయం మౌనం పాటించడం వలన వ్యక్తిగత క్రమశిక్షణ అలవడి, సంకల్ప శక్తి పెరుగుతుంది. సైలెంట్ గా ఉండటం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. వారంలో ఒకరోజు అయినా సైలెంట్ గా ఉండటం అలవాటు చేసుకుంటే మంచిది.