
ధన త్రయోదశి అంటే ఏమిటి?
హిందూ పంచాంగం ప్రకారం, ఆశ్వయుజ మాసంలోని కృష్ణపక్ష త్రయోదశి తిథినే “ధన త్రయోదశి” లేదా “ధనత్రయోదశి” అని అంటారు. ఈ రోజు నుండి దీపావళి పండుగ వేడుకలు ప్రారంభమవుతాయి. ధన త్రయోదశి నాడు బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు కొనుగోలు చేయడం శుభమని చాలా మంది నమ్ముతారు. ఈ రోజున కొన్న బంగారం లేదా వెండి వస్తువుల ద్వారా లక్ష్మీదేవి మన ఇంటిలో నివసిస్తుందనే విశ్వాసం ఉంది.
ఈ సంవత్సరం ధన త్రయోదశి తేదీ :
ఈ సంవత్సరం ధన త్రయోదశి అక్టోబర్ 18న వచ్చింది. దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఈ పర్వదినాన్ని జరుపుకోడానికి సన్నాహాలు చేస్తున్నారు. సాయంత్రం సమయంలో కుటుంబ సభ్యులు పూజలు చేసి, కొనుగోలు చేసిన వస్తువులను లక్ష్మీదేవి వద్ద ఉంచి, “అమ్మా, ఎల్లప్పుడూ మా ఇంటిని ఆశీర్వదించు” అని ప్రార్థిస్తారు.
బంగారం వెండి ధరలు పెరిగినా నమ్మకం తగ్గదు :
ఇప్పటి పరిస్థితుల్లో బంగారం, వెండి ధరలు చాలా పెరిగిపోయాయి. ఒక గ్రాము బంగారం కొనాలంటే దాదాపు ₹12,000 ఖర్చవుతుంది. వెండి ధర కూడా పదివేల రూపాయలకు తక్కువగా లేదు. అలాంటి సమయంలో మధ్యతరగతి కుటుంబాలకు బంగారం వెండి కొనడం కష్టమైన పని. అయినా కూడా ఈ రోజున ఏదో ఒక విలువైన వస్తువు కొనుగోలు చేయాలని ప్రజలలో ఉత్సాహం ఉంటుంది.
అయితే బంగారం, వెండి కాకపోయినా — చీపురు కొనండి!
పండితుల ప్రకారం ధన త్రయోదశి నాడు తప్పనిసరిగా ఏదైనా కొనుగోలు చేయడం శుభం. బంగారం వెండి కొనలేని వారు చీపురు కొనడం ఎంతో శుభప్రదమని భావిస్తారు. చీపురు అనేది స్వచ్ఛతకు, సమృద్ధికి సంకేతం.పురాణాల ప్రకారం చీపురును లక్ష్మీదేవి యొక్క చిహ్నంగా పరిగణిస్తారు. ధన త్రయోదశి రోజున కొత్త చీపురును కొనడం అంటే లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించినట్లే. ఈ రోజున కొనుగోలు చేసిన చీపురుతో ఇంటిని శుభ్రం చేయడం వల్ల ఇంటిలోని ప్రతికూల శక్తులు తొలగి, సానుకూల శక్తులు (పాజిటివ్ ఎనర్జీ) వస్తాయని పండితులు చెబుతున్నారు.
చీపురుతో వచ్చే శ్రేయస్సు:
ధన త్రయోదశి రోజున కొత్త చీపురును కొనడం ద్వారా ఇంటి పేదరికం తొలగి, కుటుంబంలో ఆదాయం పెరుగుతుందని నమ్మకం. చీపురుతో ఇంటిని శుభ్రం చేయడం లక్ష్మీదేవిని సంతోషపరుస్తుందని విశ్వసిస్తారు. లక్ష్మీదేవి ఆశీసులులభించిన ఇంటిలో ఎల్లప్పుడూ సుఖశాంతులు, సిరిసంపదలు నిలుస్తాయని పండితులు చెబుతున్నారు.
చీపురును ఎప్పుడు ఉపయోగించాలి?
ధన త్రయోదశి రోజున కొనుగోలు చేసిన చీపురును అదే రోజు ఉపయోగించడం శుభం కాదని పెద్దలు చెబుతారు. ఈ చీపురును పండగ తర్వాత వచ్చే గురువారం నుండి ఉపయోగించడం మంచిదని అంటారు. అదేవిధంగా, చీపురును ఎప్పుడూ కాలితో తాకరాదు, దానిని గౌరవంగా ఉంచాలి.
ఆధ్యాత్మిక విశ్వాసం – వ్యక్తిగత నిర్ణయం:
ఈ సమాచారం పండితులు, పురాణాలు మరియు ఆధ్యాత్మిక నమ్మకాల ఆధారంగా చెప్పబడింది. ఈ విశ్వాసాలను ఎంతవరకు నమ్మాలనేది పూర్తిగా ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత అభిప్రాయం. అయితే శుభకార్యాల సమయంలో పాజిటివ్ ఎనర్జీని, విశ్వాసాన్ని పెంపొందించుకునే ఆచారాలుగా వీటిని చాలా మంది ఆచరిస్తున్నారు. ఇలా ఈ ధన త్రయోదశి రోజున చీపురు కొనడం కేవలం ఆచారం మాత్రమే కాదు, మనసులోని నమ్మకం, భక్తి, శ్రద్ధలకు ప్రతీకగా మారింది.