తెలుగు సినీ పరిశ్రమలో కేవలం హీరో పాత్రలు మాత్రమే కాకుండా.. సహాయ నటుడిగా.. హాస్యనటుడిగా.. తండ్రిగా, స్నేహితుడిగా ఇలా ప్రతి పాత్రలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ప్రముఖ నటుడు చంద్రమోహన్. ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఉన్న విలక్షణ నటులలో చంద్రమోహన్ ఒకరు. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. 1945లో మే 23న జన్మించారు చంద్రమోహన్. ఈరోజు ఆయన 76వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన తన వ్యక్తిగత, సినీ జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకున్నారు.కామెడీ చేయడం చాలా కష్టం.. కానీ ఒక హాస్యనటుడిగా నిలదోక్కుకోవాలంటే చాలా కష్టం.చెప్పే డైలాగ్‏లో పంచ్, మోటివేషన్ ఉండాలి.

ముఖ్యంగా జనాలకు ఆ కామెడీ నచ్చేలా ఉండాలి. షూట్ సమయంలో మన మూడు ఎలా ఉన్నా.. కెమెరా ముందు మాత్రం నవ్వులు చిందించాలి. అలాగే ఇతర నటులను కూడా డామినేట్ చేయకూడదు. ప్రేక్షకులు ప్రతిసారి కొత్తదనం కోరుకుంటారు. అయితే ఈ విషయంలో నాకు అంతగా ఇబ్బంది అనిపించలేదు. ఎందుకంటే.. మా కుటుంబంలో మేం నవ్వకుండా ఇతరులను నవ్వించే అలవాటు ఉంది. మా ఇంట్లో తమ్ముడు, అక్కలు, నాన్నగారు అందరూ నవ్వకుండానే ఇతరులను నవ్వించేవాళ్లు. హీరోగా మాత్రమే చేయాలి అనుకోలేదు. అలా అనుకుంటే సినీ పరిశ్రమలో కేవలం 50 ఏళ్లు ఉండేవాడిని. అందుకే అన్ని రకాల పాత్రలు చేయాలనుకున్నాను. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే.. ఆల్ రౌండర్ అనిపించుకోవాలని గ్రహించాను.

అందుకే అన్ని పాత్రలు చేయడం స్టార్ట్ చేశాను. అలా 50 ఏళ్ళు నిర్విరామంగా సినిమాలు చేస్తూ.. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాను. ఎవరైన ఆరోగ్యం గురించి శ్రద్ద తీసుకో అంటే.. ఇనుముకు చెదలు పడుతుందా ? అనేవాడిని. కానీ ఆ నిర్లక్ష్యమే ఇప్పుడు నా ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లో పడేసింది. రాఖీ సినిమా చేసిన తర్వాత బైపాస్ సర్జరీ చేయించుకున్నాను. ఆ తర్వాత దువ్వాడ జగన్నాథమ్ సినిమా సమయంలో అనారోగ్యంతో షూటింగ వాయిదా వేశాను. అయితే ఇప్పుడు నా సినిమాలు టీవీలో, యూట్యూబ్‏లో వస్తున్నాయి. గతంలో కన్నా ఇప్పుడు ఫ్యాన్స్ ఎక్కువ అయ్యారు అనిపిస్తుంది. ఈ విషయం కాస్తా సంతోషాన్ని ఇచ్చింది. ఈ జన్మకు ఇది చాలు అనిపిస్తుంది. అయితే సినీజీవితం చాలా నేర్పించింది. పేరు, డబ్బు, బంధాలు శాశ్వతం కాదని నేర్పింది. నమ్మకద్రోహులకు దూరంగా ఉండాలని, ఆర్థికంగా జాగ్రత్తగా ఉండకపోతే చాలా ప్రమాదమని తెలిపారు చంద్రమోహన్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: