టాలీవుడ్ అగ్ర‌, దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్.ఆర్.ఆర్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్న‌ది. కరోనా కారణంగా పలుసార్లు వాయిదాలు పడిన ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25న విడుద‌ల అవుతుంద‌ని  చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే అంతకంటే ముందు ఆర్.ఆర్.ఆర్ సినిమాకు రెండు విడుదల తేదీలు ప్రకటిస్తూ.. నూత‌న  ట్రెండ్‌ను రాజమౌళి సృష్టించాడు. ప్ర‌స్తుతం  ఇదే ఫార్ములాను టాలీవుడ్‌లో ప‌లు  సినిమాలు ఫాలో అవుతున్నాయి.

వారం రోజుల కిందట ఆర్.ఆర్.ఆర్ మూవీకి రెండు విడుదల తేదీలను ప్రకటించాడు ద‌ర్శ‌క ధీరుడు రాజమౌళి . మార్చి 18 లేదా ఏప్రిల్ 29న తమ సినిమాను విడుదల చేస్తామని ప్ర‌క‌టించారు. దీంతో పలు పెద్ద సినిమాల నిర్మాతలు డిఫెన్స్‌లో ప‌డిపోయారు. ఆర్.ఆర్.ఆర్ మూవీ ఏ తేదీన విడుదలవుతుందో తెలియక తికమక అయ్యారు. తీరా చూస్తే జక్కన్న ఆ రెండు తేదీలను కాదు అని  మార్చి 25వ తేదీని ఆర్.ఆర్.ఆర్ రిలీజ్‌కు ఫిక్స్ చేసాడు. అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు. మార్చి 17న కన్నడలో పునీత్ రాజ్‌కుమార్ మూవీ విడుదలవుతుంది. పునీత్ మృతికి నివాళిగా ఈ మూవీ విడుదలైన వారం రోజుల వరకు ఇతర సినిమాలను విడుదల చేయకూడదని కన్నడ పరిశ్రమ నిర్ణయం తీసుకున్న‌ది. దీంతో పాన్ ఇండియా మూవీ అయిన‌టువంటి ఆర్.ఆర్.ఆర్ మూవీ మార్చి 25కి వెళ్లిందని ప్రచారం కొన‌సాగుతుంది.

రాజ‌మౌళి ఆర్‌.ఆర్‌.ఆర్‌. మూవీ ఫార్ములాను భీమ్లానాయ‌క్ గ‌ని, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు కూడా ఫాలో అయ్యాయి.  ఇక ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన భీమ్లానాయ‌క్ సినిమాను కుదిరితే ఫిబ్ర‌వ‌రి 25న లేదా ఏప్రిల్ 01న విడుద‌ల చేస్తాం అని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించిన‌ది. మెగా హీరో వ‌రుణ్ తేజ్ న‌టించిన గ‌ని సినిమా సైతం ఫిబ్ర‌వ‌రి 25 లేదా మార్చి 04వ తేదీ అని క‌ర్చీప్ వేసింది. ర‌వితేజ న‌టించిన రామారావు ఆన్ డ్యూటీ గ‌తంలో మార్చి 25న విడుద‌ల‌వుతుంద‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించ‌గా.. ఆరోజు ఆర్.ఆర్‌.ఆర్ విడుద‌ల‌వుతుండ‌టంతో తాము కుదిరితే మార్చి 25 లేదా ఏప్రిల్ 15న వ‌స్తాం అని తాజాగా ప్ర‌క‌టించారు. టాలీవుడ్ ద‌ర్శ‌క ధీరుడు ఏదైనా సృష్టిస్తే ఇప్పుడు అంద‌రూ దానిని ఫాలో కావ‌డం ప‌రిపాటిగా మారింది. బాహుబ‌లిని పాన్ ఇండియాలో తెర‌కెక్కించ‌గా.. అదే కోవాలో  సాహో, పుష్ప‌, ఆచార్య‌వంటి త‌దిత‌ర సినిమాల‌ను తెర‌కెక్కించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: