ఒక టాప్ హీరో నటించిన మూవీ ఘోర పరాజయం చెందినప్పుడు ఆపరాజయం పాఠాలు మిగతా హీరోలకు వర్తిస్తూ ఉంటాయి. గతసంవత్సరం భారీ అంచనాలతో విడుదలైన విజయ్ దేవరకొండ ‘లైగర్’ మూవీ మొదటిరోజు మొదటి షో నుండి భయంకరమైన ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈసినిమాకు ఎన్నో హిట్స్ అందించిన పూరీ జగన్నాథ్ నిజంగా దర్శకత్వం వహించాడా లేదంటే మరెవరైనా ఈమూవీకి దర్శకత్వం చేసారా అంటూ అప్పట్లో సెటైర్ లు పడ్డాయి.


ఇప్పుడు లేటెస్ట్ గా విడుదలైన ‘ఏజెంట్’ మూవీ చూసిన వారు ఆసినిమాను చూసి తట్టుకోలేక నిజంగానే ఈమూవీకి సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహించాడా లేదంటే అతడి యూనిట్ లోని ఎవరైనా సహాయదర్శకులు ఈసినిమాను తీసాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ‘రేసుగుర్రం’ ‘కిక్’ లాంటి సూపర్ హిట్స్ తీసిన సురేంద్ర రెడ్డి సినిమాలు తీయడం మర్చిపోయాడా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.


గత సంవత్సరం విడుదలైన ‘లైగర్’ మూవీని పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో ప్రమోట్ చేసారు. విజయ్ దేవరకొండ ముంబాయ్ వెళ్ళి అక్కడ తన ‘లైగర్’ మూవీ గురించి అందరికీ తెలిసేలా ప్రతి లోకల్ ట్రైన్ ఎక్కిదిగాడు. ఇక్కడ అఖిల్ కూడ తన ‘ఏజెంట్’ ప్రమోషన్ కోసం విపరీతంగా కష్టపడ్డాడు. ఈసినిమాలోని తన బాడీ కోసం గంటల తరబడి జిమ్ లో ఉండటమే కాకుండా తన రెగ్యులర్ ఫుడ్ కు బదులు ఉప్పు కారం లేని ఉడకపెట్టిన చికెన్ నెలల తరబడి తిన్నాడు.


‘లైగర్’ విషయంలో కూడ విజయ్ దేవరకొండ తన బాడీని ఫైటర్ గా చూపించడానికి ఎంతో కష్టపడి డైటింగ్ చేయడమే కాకుండా అతడు కూడ గంటల తరబడి జిమ్ లోనే కాలం గడిపాడు. సాధారణంగా ఐటమ్ సాంగ్స్ ను ఆదరించే మాస్ ప్రేక్షకులు ‘లైగర్’ మూవీలోని ‘అకడి పకడీ’ సాంగ్ వస్తున్నప్పుడు ఎలా అసహనానికి లోనయ్యారో ‘ఏజెంట్’ మూవీలో ‘గోవింద గోవింద’ ‘రామకృష్ణ’ లాంటి మాస్ పాటలను ఏమాత్రం ఎంజాయ్ చేయలేకపోయారు. ఇలా అఖిల్ కు ‘లైగర్’ నుండి నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో ఉన్నాయి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: