అక్టోబర్ 2 న సైరా నరసింహారెడ్డి చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న నేపథ్యంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితంపై అంతటా ఆసక్తి నెలకొంది. అయితే సైరా తొలి స్వతంత్ర్య పోరాడ యోధుడు కాదంటూ సోషల్ మీడియాలో ఓ వ్యాసం సర్క్యులేట్ అవుతోంది. పది రూపాయిల పది అణాల కోసం ఉయ్యాల వాడ నరసింహారెడ్డి కంపనీ అధికారులపై తిరుగుబాటు చేసాడు అని చారిత్రక వాస్తవాలతో వివరిస్తూ బొల్లోజు బాబా వ్యాసం రాశారు.


ఆ వ్యాసం ప్రకారం.. బ్రిటీష్ ప్రభుత్వం రైత్వారీ శిస్తు విధానం ప్రవేశపెట్టినప్పుడు అప్పటి వరకూ కప్పం కడుతూ అధికారం చెలాయించిన పాలెగాండ్ర కోసం ఫించను ఇవ్వడం ప్రారంభించింది. నొసుమ్‌ సంస్థానానికి పాలెగార్‌ నరసింహారెడ్డి. నొసుమ్‌ సంస్థానాన్ని కంపనీ స్వాధీనం చేసుకొనే సమయానికి, అంతవరకూ బాకీపడిన శిస్తు నిమిత్తమై వచ్చి వివరణ ఇవ్వాల్సిందని 1800 లో థామస్‌ మన్రో పిలిచినపుడు నొసుమ్‌ నరసింహారెడ్డి హాజరు కాలేదు. క్రమేపీ ఏ ఆదాయవనరులూ లేక ఆర్ధిక ఇబ్బందులు తలెత్తటంతో తన పంతాన్ని వీడి పించను తీసుకొని, ఇంటికే పరిమితమై 4, నవంబరు 1804 లో చనిపోయాడు.


నొసుమ్‌ నరసింహారెడ్డి మరణానంతరం అంతవరకూ అతనికి ఏడాదికి ఇస్తున్న 8,323 రూపాయిల పించనును అతని భార్యకు బదలాయించింది కంపనీ. నొసుమ్‌ నరసింహారెడ్డి దత్తత కుమారుడు జయరామిరెడ్డి, అతని మనవడు ఉయ్యలవాడ నరసింహారెడ్డి. 1846 నాటికి మూడు తరాలు గడిచిపోవటం, వారసులకు పించను పంచుకొంటూ రావటం వల్ల నరసింహారెడ్డి వాటా పది రూపాయిల పది అణాల ఎనిమిది పైసలకు చేరింది. అది ఇవ్వటానికి కూడా అవమానించే పరిస్థితులు ఏర్పడటం వల్ల నరసింహారెడ్డి కంపనీ అధికారులపై తిరుగుబాటు చేసాడు.


నలభై ఆరు సంవత్సరాలలో వేరే ఏదో జీవనోపాధి ఏర్పాటుచేసుకోకుండా కంపనీ ఇచ్చే పించనుపై ఎందుకు ఆధారపడ్డారనేది ఆసక్తి కలిగించే అంశం. భవిష్యత్తు అద్భుతంగా ఉందని చెప్పిన గోసాయి వెంకన్న అనే ఒక సాధువు మాటతో కంపనీతో యుద్ధానికి దిగాడు నరసింహారెడ్డి. ఊరూరూ తిరిగి మిగిలిన బాధిత పాలెగాండ్రను ఏకం చేయగలిగాడు. వీరంతా నరసింహారెడ్డి నాయకత్వంలో నడిచి 1846 జూలై లో తాహసిల్దారును, కంపనీ గుమస్తాను చంపేయటంతో తిరుగుబాటు మొదలైంది. ఇతని అనుచరుల సంఖ్య అయిదువేలకు పెరిగింది. నరసింహారెడ్డి కొంతకాలం కంపనీ పోలీసులను గడగడలాడించి 1846 అక్టోబర్‌ 6 న కడప కలక్టర్‌ కాక్రేన్‌ కుయుక్తులవల్ల అరస్టయి ఉరితీయబడ్డాడు.


పాలెగాండ్ర వ్యవస్థ ఫ్యూడల్‌ సమాజపు నిర్మాణం. ఇందులో నిచ్చెనమెట్ల కులవ్యవస్థ దాని తాలూకు పీడన, కులాధారిత వెట్టిచాకిరీ ఉంటుంది. దాన్ని పునఃస్థాపించటానికి చేసిన వ్యక్తిగత పోరాటాన్ని దేశభక్తిగా ప్రొజెక్ట్‌ చేయటంబీ కనీసం తొలి పాలెగాండ్ర పోరాటం కూడా కానిదాన్ని తొలి స్వాతంత్య్రపోరాటంలా ప్రచారించటం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది.”


మరింత సమాచారం తెలుసుకోండి: