నాన్న పైకి గంభీరంగా కనిపించినా తన గుండె చాటున పిల్లలపై సముద్రమంత ప్రేమ దాచుకుంటాడు. అమ్మ ప్రేమ అపారం అనంతం. నాన్న ప్రేమ అద్భుతం. ఈ ప్రపంచంలో మనకు దగ్గరైన వారితో ఏ బంధం అయినా కలుపుకుని మాట్లాడుతుంటాం. అక్క, అన్న, అత్త, బాబాయ్, బామ్మ చివరికి మన మనసుకు బాగా దగ్గరైన వారిని మనపై తల్లిలా ప్రేమ కురిపించే వారిని అమ్మ అని సంబోధిస్తూ బంధం కలుపుకుంటాం. కానీ ఒక నాన్న విషయంలో మాత్రం ఇంకెవరినీ ఊహించుకొలేము, ఫీల్ అవలేము. ఎందుకంటే నాన్నలా మరెవ్వరూ మన బాధ్యతలను తీసుకోలేరు. తనలా మరెవరూ ప్రేమ పంచలేరు. అందుకే అంటుంటారు కన్నతల్లి లేకపోయినా ఆ ప్రేమను కొంతైనా పంచగలిగే వారిని అమ్మ అని పిలిచి బంధాన్ని కలుపుకోవచ్చు ఏమో గానీ, నాన్న అనే పిలుపు ఒక్కసారి దూరమైతే ఇంక ఆ స్థానంలో మరెవరూ రాలేరు, రారు. ఎందుకంటే రక్తం పంచిన తండ్రి మాత్రమే ఆ స్థానానికి అర్హుడు.

నాన్నకి పిల్లలకి మద్య ఉండే అందమైన అనుబంధాన్ని,  ఆప్యాయతను తెలియజేస్తూ ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. వాటిలో నాన్నకు ప్రేమతో చిత్రం ఒకటి. సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం 2016 జనవరి 13 న  విడుదలై రికార్డులు బ్రేక్ చేస్తూ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో ఓ నాన్నగా కనిపించిన రాజేంద్రప్రసాద్ కి ముగ్గురు కొడుకులు. బిడ్డలందరు తండ్రి మనసుని అర్దం చేసుకోలేకపోవచ్చు. కానీ తండ్రి మాత్రం బిడ్డల మనసుల్ని  పూర్తిగా చదవగలరు. వారి భవిష్యత్తును తన బాధ్యతగా మలచుకుని ఎన్ని కష్టాలు ఎదురైనా తన బిడ్డల ఆనందం కోసం పరుగులు తీస్తాడు. ఈ క్రమంలో తన చిన్న చిన్న  ఆనందాలను, అశయాలను, కోపతాపాలను పక్కన పెట్టేస్తాడు తన ఎమోషన్స్ ని తనలోనే దాచుకుంటారు. అదే ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించారు డైరెక్టర్ సుకుమార్. తండ్రి బిడ్డల మధ్యలో ఉన్న అనుబంధాన్ని , ఎమోషన్స్ ని చక్కగా చూపించారు.

 తన బిడ్డలకు తండ్రి ఎలా తన జీవితాన్ని అందించడానికి ప్రయత్నం చేశారు అనే విషయాన్ని కొన్ని పాత్రలతో సినిమా రూపంలో ప్రెజెంట్ చేశారు. అలాగే ఓ కొడుకు  తన తండ్రి పెదవిపై చిరునవ్వు కోసం ఎంతగా తపిస్తాడో అన్నది కనబరచాడు. తండ్రి బిడ్డల మధ్య ఉన్న ఆ సున్నితమైన భావోద్వేగాలను ప్రేక్షకుల  ముందుంచారు. ఇక కథ కంటెంట్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లల కోసం  తన ఆనందాన్ని పక్కన  పెట్టిన తండ్రి కోసం, కొడుకుగా ఆయన కోరిక తీర్చడం కోసం చేసే ఎమోషనల్ జర్నీనే నాన్నకు ప్రేమతో చిత్రం. అనుకున్న విధంగానే తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్ ని వెండితెరపై  ప్రెజెంట్ చేయడంతో సక్సెస్ అయ్యారు సుకుమార్. ప్రేక్షకులందరూ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా "నాన్నకు ప్రేమతో..." అనే పాటలో నాన్న గొప్పతనం గురించే చెప్పే ప్రతి ఒక్క పదం మనసు లోతుల్లోకి వెళ్లి నమ్మ జ్ఞాపకాలను తట్టిలేపుతుంది.  దానికి మంచి మ్యూజిక్ కూడా యాడ్ అవడంతో సాంగ్ ఫుల్ ఫేమస్ అయింది. ఇలా ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా కుదిరి సినిమా అధ్బుతమైన సక్సెస్ ను అందుకుంది. ఈ సినిమాలో నాన్న విలువను తెలియచెప్పే విధానం ప్రతి ఒక్క మనసుని కదిలించేలా ఉన్నాయి. పిల్లల కోసం తన జీవితాన్ని ధారపోసే తండ్రుల అందరికీ ఈ సినిమా అంకితం.

మరింత సమాచారం తెలుసుకోండి: