యువ కథానాయకుడు విజయ్ దేవరకొండకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలకు యూత్‌లో, ముఖ్యంగా బి, సి సెంటర్లలో మంచి ఫాలోయింగ్ ఉంది. 'అర్జున్ రెడ్డి'తో యూత్ ఐకాన్‌గా మారిన విజయ్ దేవరకొండ, ఆ తర్వాత 'గీత గోవిందం', 'టాక్సీవాలా' వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'కింగ్డమ్' పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ హక్కులకు మార్కెట్‌లో ఊహించని డిమాండ్ ఏర్పడింది.

తాజా సమాచారం ప్రకారం, 'కింగ్డమ్' సినిమా సీడెడ్ హక్కులు ఏకంగా 6 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. రాయలసీమ ప్రాంతంలో విజయ్ దేవరకొండ సినిమాలకు మంచి కలెక్షన్లు వస్తాయని డిస్ట్రిబ్యూటర్లు  భావిస్తున్నారు. గతంలో ఆయన నటించిన చిత్రాలు సీడెడ్‌లో అద్భుతమైన వసూళ్లను రాబట్టడమే దీనికి ప్రధాన కారణం. ఈ భారీ డీల్, 'కింగ్డమ్' చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో ఎంత నమ్మకం ఉందో స్పష్టం చేస్తోంది.

అదేవిధంగా, కోస్తాంధ్ర హక్కులు సైతం భారీ మొత్తానికి విక్రయించబడినట్లు సమాచారం. కోస్తాంధ్ర ప్రాంతంలో 'కింగ్డమ్' థియేట్రికల్ హక్కులు ఏకంగా 9 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లోనే ఇంత భారీ మొత్తంలో హక్కులు అమ్ముడవడం, సినిమాపై ఉన్న అంచనాలకు అద్దం పడుతోందని చెప్పవచ్చు.

ఈ నెల 31వ తేదీన కింగ్డమ్ సినిమా థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి  మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే  భారీ స్థాయిలో కలెక్షన్లు రావడం మరీ కష్టం కాదు. విజయ్ దేవరకొండ కెరీర్ కు ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకం కాగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా  ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: