
నిర్వాహకుల వైఫల్యం ఒక కారణం అయినా, అంతకుమించి అభిమాన ముసుగులో ఉన్న అవివేకం, హద్దులు దాటిన పిచ్చి మరో కారణం. హీరోని తెరపైనే కాకుండా ప్రత్యక్షంగా చూడాలనుకోవడం తప్పు కాదు. కానీ ప్రాణాలు పణంగా పెట్టేవరకు అది అభిమానం కాదు, అవివేకం. ఈ సంఘటనలో పసిపాపల ప్రాణాలు కూడా పోయాయి. చిన్నారులను చంకలో పెట్టుకుని ఇలాంటి రిస్క్ ఈవెంట్లకు వెళ్ళడమేంటి? ఇంట్లో కూర్చుని టీవీలో చూస్తే అభిమానంలో లోటు వచ్చిపోతుందా? కాదుకదా. రిస్క్ ఉన్నా కూడా ఇలాంటి సభలకు పోవడమేంటీ? ఇది కేవలం విజయ్ అభిమానుల సమస్య కాదు. అన్ని భాషల్లో, అన్ని హీరోల అభిమానుల్లో ఇదే దుస్థితి.
కటౌట్ కడుతూ విద్యుత్ తీగలకు తగిలి చనిపోయిన సంఘటనలు, హీరోల మధ్య ఫ్యాన్ వార్‌లలో చనిపోయిన వాళ్ల కథలు, సంధ్య థియేటర్లో తొక్కిసలాటలు, ఫ్లాప్ మూవీ వల్ల ఆత్మహత్య చేసుకున్న అభిమానులు - ఇవన్నీ మనం విన్నవే. ఎవరి కోసం? ఎవరి మెప్పు కోసం? జీవితం అమూల్యమైనది. అది సినిమా కంటే, స్టార్ల కంటే గొప్పది. కుటుంబాన్ని, తల్లిదండ్రులను ప్రేమించే వారికి మాత్రమే ఆ విలువ అర్థమవుతుంది. సినిమాను అభిమానించడం తప్పు కాదు, నేరం కాదు. కానీ అందుకోసం ప్రాణాల్ని పణంగా పెట్టడం మాత్రం సరికాదు. నిజమైన అభిమానమే అయితే హీరోలూ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండమని కోరుతారు. మీ ప్రాణం మీకోసమే, మీ కుటుంబం కోసమే. సినిమాకు కాదు.