
ఒకప్పుడు "ఈ సినిమా టీవీలో ఎప్పుడు వస్తుందా?" అని ఆతృతగా ఎదురుచూసిన ఫ్యాన్స్.. ఇప్పుడు అలాంటి ఫీలింగ్‌కి దూరమయ్యారు. థియేటర్లలో విడుదలైన మూడు నుంచి నాలుగు నెలల తర్వాతే టీవీలో ప్రసారం అవుతుంది. కానీ అప్పటికి ఆ సినిమాను ఎక్కువ శాతం మంది ఓటీటీల్లో చూసేసి ఉంటారు. దీంతో టెలివిజన్ స్క్రీనింగ్‌కు ఆడియన్స్ చాలా తగ్గిపోయారు. ఫలితంగా టీవీ ఛానెల్స్ కూడా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి హక్కులు కొనాలనే ఆసక్తి చూపడం లేదు. ఒకప్పుడు కోట్లు కోట్లు పెట్టే ఛానెల్స్.. ఇప్పుడు కనీసం తక్కువ రేటుకైనా కొనడానికి వెనుకంజ వేస్తున్నాయి. కొన్ని సినిమాలు అయితే ఎవరూ పట్టించుకోకుండా అన్‌సోల్డ్‌గానే మిగిలిపోతున్నాయి.
ఈ పరిస్థితి స్టార్ హీరోల సినిమాలకు కూడా వర్తిస్తోంది. బిగ్ బడ్జెట్ మూవీస్‌కి కూడా ఛానెల్స్ ఎలాంటి క్రేజ్ చూపించడం లేదు. ముఖ్యంగా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ అన్నీ కలిపి చూస్తే.. నార్త్ టు సౌత్ అంతా ఇదే సీన్. నిజానికి శాటిలైట్ రైట్స్ అమ్ముడవ్వకపోవడం వల్ల నిర్మాతలు బడ్జెట్ మేనేజ్ చేయడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు సేఫ్ జోన్‌లోకి తెచ్చిన ఈ వనరు.. ఇప్పుడు దాదాపుగా అస్తమించిపోయే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి చూస్తే.. డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ రాకతో శాటిలైట్ మార్కెట్ పూర్తిగా కుదేలయింది. ఇకపై పరిస్థితి మరింత క్రిటికల్‌గా మారే ఛాన్స్ ఉంది. భవిష్యత్తులో టీవీ స్క్రీనింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉండబోతుందో, ఇంకా బతికి బట్టకడుతుందో.. లేక ఓటీటీలే పూర్తి ఆధిపత్యం చెలాయిస్తాయో చూడాలి. కానీ ఇప్పటివరకు ఉన్న లెక్కలు చూస్తే మాత్రం.. "శాటిలైట్ మార్కెట్ గుడ్‌బై చెప్పేసినట్లే!"