ఎస్.ఎస్. రాజమౌళి.. ఈ పేరు వింటేనే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు మొదలవుతాయి. అపజయమే ఎరుగని ఈ ధీరుడు తన ప్రస్థానాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'స్టూడెంట్ నెం. 1'తో ప్రారంభించారు. ఆ సినిమా అప్పట్లో పెద్ద మ్యూజికల్ హిట్, ఎన్టీఆర్ కెరీర్‌కు పునాది. కానీ, చిత్రంగా అదే సినిమా అంటే రాజమౌళికి అస్సలు ఇష్టం లేదట. ఇప్పటికీ ఆ సినిమా టీవీలో వస్తే ఛానెల్ మార్చేస్తానని ఆయన చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.రాజమౌళి ఈ విషయంపై స్పందిస్తూ.. "స్టూడెంట్ నెం. 1 సినిమా చేస్తున్నప్పుడు నాకు డైరెక్షన్ గురించి కనీసం ఓనమాలు కూడా తెలియదు. అప్పుడు నేను కేవలం షాట్లు తీయడం మాత్రమే చేశాను. ఒక కథను ఎలా నడపాలి, ఎమోషన్ ఎలా పండించాలి అనే దానిపై నాకు అవగాహన లేదు. కేవలం రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో ఆ సినిమాను పూర్తి చేశాను" అని నిజాయితీగా ఒప్పుకున్నారు. ఒక సక్సెస్ ఫుల్ సినిమా గురించి ఇంత ఓపెన్‌గా మాట్లాడటం కేవలం రాజమౌళికే సాధ్యం.


రాజమౌళికి పర్ఫెక్షన్ అంటే చాలా ఇష్టం. ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉండాలనుకుంటారు. కానీ 'స్టూడెంట్ నెం. 1' చూస్తున్నప్పుడు అందులోని షాట్ మేకింగ్, ఎడిటింగ్ పాటర్న్స్ చూసి ఆయనకే చిరాకు వేస్తుందట. "నేను ఆ సినిమాను ఎందుకు అలా తీశానా అని నా మీద నాకే కోపం వస్తుంది. అందుకే ఆ సినిమాను మళ్ళీ చూడటానికి నా మనసు అంగీకరించదు" అని జక్కన్న తన లోపలి బాధను వెలిబుచ్చారు. అంటే, ఇవాళ మనం చూస్తున్న గ్లోబల్ డైరెక్టర్ వెనుక తనను తాను విమర్శించుకునే ఒక గొప్ప విద్యార్థి ఉన్నాడని దీనివల్ల అర్థమవుతోంది.ఆ సినిమా హిట్ క్రెడిట్ మొత్తాన్ని రాజమౌళి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు గారికే ఇచ్చారు. రాఘవేంద్రరావు గారి ప్లానింగ్, మ్యూజిక్ సెన్స్ మరియు ఎన్టీఆర్ చూపించిన ఎనర్జీ వల్లే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యిందని ఆయన చెప్పుకొచ్చారు. తనకేమీ తెలియని రోజుల్లో తనను నమ్మి అవకాశం ఇచ్చిన వారందరికీ ఆయన ఎప్పుడూ రుణపడి ఉంటానని కూడా పేర్కొన్నారు.


'స్టూడెంట్ నెం. 1' లో చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ 'సింహాద్రి' నుంచి ఆయన తన విశ్వరూపం చూపించడం మొదలుపెట్టారు. ఇప్పుడు మహేష్ బాబుతో తీస్తున్న 'వారణాసి' (SSMB29) కోసం ఆయన పడుతున్న శ్రమ చూస్తుంటే, పాత సినిమాలపై ఆయనకున్న ఆ అసహనమే ఆయన్ని ఈ స్థాయికి చేర్చిందనిపిస్తోంది. ప్రతి సినిమాలోనూ తనను తాను అధిగమించాలనే ఆ తపనే రాజమౌళిని 'నెంబర్ 1' డైరెక్టర్‌గా నిలబెట్టింది.మొత్తానికి తన మొదటి సినిమాపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఆయన నిరాడంబరతకు, నిజాయితీకి నిదర్శనం. తనను తాను తక్కువ చేసుకుని మాట్లాడటం కాదు, ప్రతిరోజూ ఏదో ఒకటి నేర్చుకోవాలనే ఆయన ఫిలాసఫీ ఇప్పుడు యంగ్ డైరెక్టర్లకు ఒక గైడ్ లాంటిది. 'స్టూడెంట్ నెం. 1' నచ్చకపోయినా, రాజమౌళి లోని ఆ 'విద్యార్థి' మాత్రం ఎప్పుడూ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు!

మరింత సమాచారం తెలుసుకోండి: