టాయిలెట్లలో ఎక్కువ సేపు గడపుతున్నారా? అయితే, జాగ్రత్త ఇలాంటి టాయిలెట్లు వచ్చాయంటే, కనీసం 7 నిమిషాలకు మించి కుర్చోలేరు. ఎప్పటికప్పుడు సాంకేతికంగా వస్తున్నమార్పులకు అనుగుణంగా ఇక పై టాయిలెట్లో కూడా ప్రశాంతంగా గడిపే వీలుండదు మరి. ఇప్పటికే  ఓ సంస్థ ఇటీవల టాయిలెట్లో పది నిమిషాలు కంటే ఎక్కువ సేపు గడిపితే.. వాసన చూసి మరీ పసిగట్టేస్తామని హెచ్చరించింది. వారు మూత్ర విసర్జన కోసం టాయిలెట్‌కు వెళ్లలేదని నిరూపితమైతే చర్యలు తీసుకుంటామని తెలిపింది.తాజా పరిణామాల నేపథ్యంలో.. పరిస్థితిని అంత వరకు తెచ్చుకోకుండా.. టాయిలెట్లలో తక్కువ సేపు గడిపి యాజమాన్యాన్ని మెప్పించండి. లేకపోతే.. ఇలాంటి టాయిలెట్లు ఇండియాకు కూడా వచ్చేస్తాయి. త్వరలోని ఇలాంటి టాయిలెట్ల తయారీ పూర్తై.. ముఖ్యంగా  కార్యాలయాల్లో ప్రత్యక్షం కానున్నాయంట. ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం, ఇంటర్నెట్ సదుపాయాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత.సగానికి పైగా జనాభా టాయిలెట్లలోనే గడిపేస్తున్నారు. ఇక ఆఫీసుల్లో మరీ అరాచకం. టాయిలెట్లలోకి వెళ్లారంటే.. మళ్లీ ఎప్పుడు తిరిగి వస్తారనేది కష్టమే. ఈ నేపథ్యంలో యూకేకు చెందిన ఓ సంస్థ ఏకంగా టాయిలెట్ డిజైనే మార్చేసింది. సమానంగా ఉండాల్సిన టాయిలెట్ సీటును వాలుగా డిజైన్ చేయించింది. ఇకపై సిబ్బంది టాయిలెట్లో ఎక్కువ సేపు గడిపేందుకు వీలుండదని, ఈ మేరకు టాయిలెట్ డిజైన్‌లో మార్పు చేశామని నోటీసులో పేర్కొంది. టాయిలెట్ వాలుగా ఉండటం వల్ల అందులో కుర్చునే వ్యక్తి కాళ్లపై ఎక్కువ సేపు ఆధారపడాల్సి ఉంటుంది. పైగా పిరుదులు కూడా కిందికి జారుతుంటాయి. ఇందులో 7 నిమిషాలకు మించి కుర్చోవడం కష్టం. అలాగే దీని ఎత్తు కూడా సాధారణ టాయిలెట్ కంటే తక్కువగా ఉంటుంది. దీనివల్ల కాళ్లు గుంజేస్తాయి.

ఈ టాయిలెట్ల తయారీ కోసం స్టాండర్డ్ టాయిలెట్ సంస్థ బ్రిటీష్ టాయిలెట్ అసోసియేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. టాయిలెట్ ఇలా ఒంపుగా ఉండటం వల్ల ఉద్యోగులు ఎక్కువ సేపు ఆఫీస్ టాయిలెట్లలో గడపరని, దీనివల్ల ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుందని ప్రచారం చేస్తోంది. దీంతో ఈ సంస్థకు పలు కార్పొరేట్ సంస్థల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ఈ టాయిలెట్ తయారీ కోసం మెహబీర్ గిల్ అనే డిజైనర్‌కు బాధ్యతలు అప్పగించారు. 

ఈ సందర్భంగా మెహబీర్ గిల్ మాట్లాడుతూ.. ‘‘యూకేలో ఉద్యోగుల కోసం ఏడాదికి రూ.4 బిలియన్ డాలర్లు ఖర్చవుతున్నాయి. కానీ, దానికి తగిన ప్రొడక్టివిటీ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇలాంటి టాయిలెట్ల ఏర్పాటుతో ఉద్యోగుల్లో మార్పు తేవచ్చు. ఈ టాయిలెట్ల వల్ల ఉద్యోగులకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వారి ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు’’ అని తెలిపారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: