తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కరీంనగర్ మినహా 120 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగగా అధికార పార్టీ టీఆర్ ఎస్ 110 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 4 మున్సిపాలిటీలలో విజయం సాధించగా బీజేపీ పార్టీ రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఎంఐఎం భైంసా, జన్ పల్లి మున్సిపాలిటీలను కైవసం చేసుకోగా కోరంలేక మేడ్చల్ ఛైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. నేరేడుచర్ల మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నిక ఈరోజు సాయంత్రానికి వాయిదా పడింది. 
 
మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఈరోజు మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ నుండి మీడియాతో మాట్లాడుతూ ప్రత్యర్థులైన బీజేపీ కాంగ్రెస్ కు అందని స్థాయిలో టీఆర్‌ఎస్‌ గెలిచిందని అన్నారు. కాంగ్రెస్ బీజేపీ చాలా తిప్పలు పడ్డారని చాలా చోట్ల కుమ్మక్కయ్యారని కేటీఆర్ అన్నారు. మక్కల్ లో బీజేపీ ఛైర్మన్ అయితే కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని మణికొండలో కాంగ్రెస్ ఛైర్మన్ అయితే బీజేపీ వైస్ ఛైర్మన్ అయిందని తుర్కయాంజల్ లో కాంగ్రెస్ ఛైర్మన్ బీజేపీ వైస్ ఛైర్మన్ అయిందని అన్నారు. 
 
బీజేపీ, కాంగ్రెస్ పేరుకేమో ఢిల్లీ పార్టీలు చేసేవేమో సిల్లీ పనులు అంటూ కేటీఆర్ అదిరిపోయే పంచ్ వేశారు.. జాతీయ పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్ లు ప్రాంతీయ పార్టీ టీఆర్‌ఎస్‌ ను ఎదుర్కోలేక పొత్తు పెట్టుకున్నాయని అన్నారు. ఎన్నికల ముందే ఇది ఒక అపవిత్ర అవగాహన అని చెప్పామని ఎన్నికల తరువాత బాహాటమైందని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు షాక్ అనే చెప్పారు. 
 
బీజేపీ కాంగ్రెస్ కొన్ని మున్సిపాలిటీలలో పెట్టుకున్న పొత్తు గురించి కేటీఆర్ ఢిల్లీ పార్టీలు చేసే సిల్లీ పనులు అనటంపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాజయంతో నిరుత్సాహంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు గోరు చుట్టు మీద రోకలి పోటు అనే చెప్పవచ్చు. ఎన్నికల ముందు తెలంగాణలో భారీ స్థానాలలో విజయం సాధించి టీఆర్‌ఎస్‌ కు షాక్ ఇస్తామన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఫలితాలలో మాత్రం సింగిల్ డిజిట్ స్థానాలలో విజయం సాధించటం గమనార్హం. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: