కరోనా అనేది అనారోగ్యంతో ఉన్న వారికి మాత్రమే సోకే వ్యాధి కాదని ఆరోగ్యవంతుల ప్రాణాలను కూడా రిస్కులో పెడుతుందని పలు సందర్భాల్లో నిరూపించబడింది.. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తి, పైకి ఎంత ఆరోగ్యంగా కనిపించినా ఇలాంటి వారికి కూడా ఈ వైరస్ వల్ల ముప్పు ఎక్కువే అని తెలిసిందే.. ఇలాంటి దశలో కరోనా విషయంలో ఐసీఎంఆర్‌ తన పరిశోధనలో మరో కొత్త విషయాన్ని తెలిపి షాక్‌కు గురిచేస్తుంది..

 

 

అదేమంటే కరోనా బాధితుల్లో రోగ నిరోధకశక్తి తగ్గుతున్న క్రమంలో శరీరంలో ఉండే బ్యాక్టీరియాలు కరోనా వైరస్‌కు సహకరిస్తున్నాయని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్ వారి తాజా పరిశోధనలో తేలిందట. ముఖ్యంగా ప్రివొటెల్లా బ్యాక్టీరియా ద్వార ఈ ముప్పు ఎక్కువగా ఉందట.. ఇక ఈ గ్రామ్‌ నెగెటివ్‌ బ్యాక్టీరియా, బ్యాక్టిరాయిడెట్స్‌ వర్గానికి చెందినదిగా పేర్కొన్నారు.. కాగా ఇది పరాన్నజీవిగా గొంతు, అన్నవాహిక, మహిళల గర్భాశయ ముఖద్వారంలో ఉంటూ ఇతర బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌కు ఉత్ప్రేరకంగా పనిచేస్తుందట.

 

 

అయితే మానవ శరీరానికి ఈ బ్యాక్టీరియా వల్ల ప్రత్యక్షంగా ఎలాంటి ఇన్ఫెక్షన్‌ ఉండనప్పటికీ, ఇతర బ్యాక్టీరియాలను ప్రేరేపించడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నట్లుగా పరిశోధనల్లో గుర్తించారట. అదీగాక ఇది శరీరంలో ఎక్కువ ప్రొటీన్లు విడుదల చేయడంవల్ల వైరస్‌ ప్రభావం మరింత పెరుగుతోందని, దీంతో కరోనా బాధితులు రిస్క్‌లో పడుతున్నట్లు గమనించామని పరిశోధకులు తెలుపుతున్నారు..

 

 

అంతే కాకుండా ఎలాంటి అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు లేని వారిలో కరోనా తీవ్రం కావడానికి ఈ ప్రివొటెల్లా బ్యాక్టీరియా కారణమనే నిర్దారణకు వచ్చారట. ఇకపోతే ఐసీఎంఆర్‌.. తమ శాస్త్రవేత్తలతో పాటు జాతీయ ఎయిడ్స్‌ పరిశోధన సంస్థ ప్రతినిధులతో కలిసి ఈ పరిశీలన జరపగా ఈ విషయాలు వెలుగు చూసాయని, కాగా ఈ క్రమంలో కరోనా చికిత్సలో ప్రివొటెల్లా స్థితిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని వీరు తెలుపుతున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: