అసలు మాస్కే పెట్టుకోనని విర్రవీగిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. మాస్క్ తో దర్శనమిచ్చారు. వాషింగ్టన్ సమీపంలో రీడ్ మిలటరీ ఆస్పత్రికి వెళ్లిన సమయంలో మాస్క్ పెట్టుకుని కనిపించారు. కేసులు పెరుగుతున్నా మాస్క్ పెట్టుకోవడానికి నిరాకరించిన ట్రంప్.. ఇప్పుడు మాస్క్ తో కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. 

 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాస్క్ పెట్టుకుని ప్రజల ముందుకొచ్చారు. వాషింగ్టన్ స‌మీపంలోని వాల్టర్ రీడ్ మిల‌ట‌రీ ఆసుప‌త్రి సందర్శన స‌మ‌యంలో.. అధ్యక్ష ముద్ర ఉన్న మాస్క్ తో కనిపించారు ట్రంప్.  వైద్యాధికారుల సూచ‌న మేర‌కు ట్రంప్ ఈసారి మాస్కు ధ‌రించిన‌ట్లు స‌మాచారం.

 

కోవిడ్ రోగులకు వైద్యం అందిస్తూ అనారోగ్యానికి గురైన ఆరోగ్య సంర‌క్షకులు, స్వచ్ఛంద సేవా స‌భ్యుల‌ను ప‌రామర్శించడానికి మిల‌ట‌రీ ఆసుప‌త్రికి ట్రంప్ వెళ్లారు. ఆసుప‌త్రుల‌కు వెళ్లే స‌మ‌యంలో మాస్క్ ధ‌రించ‌డం అత్యంత ముఖ్యమని ట్రంప్ చెప్పారు. అయితే గ‌త ‌కొన్ని నెల‌లుగా అమెరికాలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్నా..  ట్రంప్ మాత్రం మాస్క్ పెట్టుకోవడానికి నిరాక‌రించారు. గ‌తంలో ఒకసారి ఫోర్డ్ ప్లాంటును సంద‌ర్శించినప్పుడు మాత్రమే కొద్దిసేపు మాస్క్ ధ‌రించారు. తాను మాస్క్ పెట్టుకునేది లేదని చాలాసార్లు బహిరంగంగానే చెప్పారు ట్రంప్. 

 

అగ్రరాజ్యం అమెరికాలో క‌రోనా వైర‌స్ ఉద్ధృతి భారీగా పెరిగింది. నిత్యం దాదాపు 60వేల పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇప్పటికే దేశంలో 32 ల‌క్షల పాజిటివ్ కేసులు న‌మోదుకాగా.. ల‌క్షా 34వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మాస్క్ ధ‌రించ‌డంతోపాటు భౌతిక దూరాన్ని పాటించాల‌ని ఆయా రాష్ట్రాల గ‌వ‌ర్నర్లు, అధికారులు ప్రజ‌ల‌కు సూచిస్తున్నారు. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కూడా మాస్క్ ధ‌రించ‌డం త‌ప్పనిస‌రని ప‌లుమార్లు స్పష్టం చేశారు. అయిన‌ప్పటికీ ట్రంప్ మాత్రం మీడియా స‌మావేశాలు, ర్యాలీలు, బ‌హిరంగస‌భ‌లు జ‌రిగిన స‌మ‌యంలోనూ మాస్కు ధ‌రించలేదు. దీంతో ఇది ఎన్నిక‌ల ప్రచారాంశంగా మారింది. డెమోక్రటిక్ నేత జో బైడెన్ కూడా ట్రంప్ తీరుపై మండిప‌డ్డారు. క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోన్న త‌రుణంలోనూ అధ్యక్షుడు మాస్కు ధ‌రించ‌క‌పోవ‌డంపై ఆయన్ను ఒక ఫూల్‌గా అభివ‌ర్ణించారు. ప్రత్యర్థుల నుంచి విమ‌ర్శలు రావడంతో పాటు ప్రజ‌లు, అధికారుల నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో అధికారుల సూచ‌న‌తో చివ‌ర‌కు ట్రంప్‌ మాస్కు ధ‌రించార‌ని స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: