ప్రపంచంలో కరోనా ఎప్పటి నుంచి మొదలైందో.. ఆనాటి నుంచి కనీ వినీ ఎరుగని రీతిలో దారుణాలు చూడాల్సి వస్తుంది. మనుషుల మద్య అంతరాలు పెరిగిపోతున్నాయి.. మరణాలు సంబవిస్తున్నాయి.. ఆర్థిక నష్టం వాటిల్లుతుంది.  ఒకప్పుడు అందరూ కలిసి కట్టుగా జీవించాలన్న పదానికి అర్థం మారిపోయే ప్రమాదం వాటిల్లుతుంది.  గుంపులుగా ఉండకూడదు.. భౌతిక దూరం పాటించాలి.. మాస్క్ ధరించాలి అన్న ఆంక్షలు వినిపిస్తున్నాయి.  ఇక కరోనా సోకిన వారి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.. మనుషులకు దూరంగా ఉంచడంతో వారు మానసికంగా కృంగి పోతున్నారు. ఎవరైనా రోడ్డుపై అస్వస్థతతో ఉంటే వారికి కరోనా వచ్చిందన్న భయంతో దూరంగా పారిపోతున్నారు.  కరోనాతో మరణించిన వారిని జేసీబీతో తరలించారు.. చెత్త బండిలో తీసుకు వెళ్లారు. మరికొన్ని చోట్ల కరోనాతో మరణించిన వారికి ఖననం కూడా చేయడాన్ని తిరస్కరిస్తున్నారు.  

 

తాజాగా వికారాబాద్ జిల్లాలోని ధారూర్ మండలంలో హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ గొంతు నొప్పితో బాధపడుతూ ఆర్టీసీ బస్సులో మరణించిగా మహిళ మృతదేహాన్నిరోడ్డు మధ్యలోనే దింపి వేశారు. ధారూ‌ర్‌ మండలానికి చెందిన చిన ఆశప్ప 40 ఏండ్ల తన భార్య, ఇద్దరు కుమార్తెలతో ఆర్టీసీ బస్సు ఎక్కాడు. ఆశప్ప భార్యకు గొంతులో కణతి అయ్యింది. ఆమెకు చికిత్స చేయించడానికి తాండూర్ నుంచి హైదరాబాద్ కి బయలు దేరారు. మార్గమధ్యంలో ఆమెకు గొంతులో నొప్పి తీవ్రమైంది. నొప్పికి తాళలేక మహిళ బస్సులోనే మరణించింది.

 

కరోనావైరస్ వల్లే మహిళ చనిపోయి ఉండవచ్చనే భయంతో తోటి ప్రయాణికులు, డ్రైవర్‌, కండక్టర్‌ మహిళ మృతదేహాన్ని బస్సులోంచి దించమని ఆశప్పను కోరారు.  ఆమె అనారోగ్య పరిస్థితి గురించి ఎంత చెప్పినా వినిపించుకోకుండా రోడ్డు మద్యలోనే దింపారు. దిక్కుతోచని స్థితిలో కూతుళ్లు తల్లి మృతదేహం వద్ద రోధిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.  ఆ తరువాత ఆ వ్యక్తి తన అల్లుడు, కిష్టాపూర్‌ సర్పంచ్‌కు సమాచారం అందించగా.. చివరకు ఒక ఆటో డ్రైవర్ మృతదేహాన్ని వారి సొంత గ్రామానికి తీసుకెళ్లడానికి అంగీకరించాడు. ఆ తరువాత మృతదేహానికి కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్‌గా తేలిందని వైద్యులు ధృవీకరించారు. దేశంలో ఇలాంటి దారుణాలు ఎన్నో చోటు చేసుకోవడం శోచనీయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: