`గిఫ్ట్‌ ఏ స్మైల్`‌...ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని చేపట్టిన సేవా కార్యక్రమం. కరోనా కష్టకాలంలో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ తోడుగా నిలవాలని పిలుపునిస్తూ దీన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో గిఫ్ట్‌ ఏ స్మైల్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. ఇందులో ప్ర‌ధానంగా క‌రోనా క‌ష్ట కాలంలో ప్రజలను ఆదుకోవ‌డానికి వీలుగా అంబులెన్స్ వాహ‌నాల కోసం విరాళాలు అందుతున్నాయి. ఇప్పటికే అనేక మంది అంబులెన్స్ వాహ‌నాల కోసం నిధుల‌ను కేటీఆర్ కు సహాయంగా అంద‌జేశారు.



ఈ ప్ర‌క్రియ కొన‌సాగింపుగా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్ పర్సన్, నేత‌లు వాహ‌నాలకు అవ‌స‌ర‌మైన చెక్కుల‌ను పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాక‌ర్ రావు, స్త్రీ శిశు సంక్షేమ‌శాఖ మంత్రి సత్యవతి రాథోడ్  స‌మ‌క్షంలో మంత్రి కేటీఆర్‌కు అంద‌చేశారు. భూపాల‌ప‌ల్లి ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట ర‌మ‌ణారెడ్డి ఆయ‌న స‌తీమ‌ణి వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా ప‌రిష‌త్ చైర్ పర్సన్ గండ్ర జయంతిల ఒక వాహ‌నానికి అవ‌స‌ర‌మైన నిధుల చెక్కుని అంద‌జేశారు. ప‌‌ర‌కాల ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి మ‌రో వాహ‌నం కోసం చెక్కుని అంద‌జేశారు. టీఆర్ఎస్ నాయ‌కులు ఒద్దిరాజు ర‌విచంద్ర‌, కాకుల‌మాను లక్ష్మణ్ రావులు ఒక్కో వాహ‌నానికి అవ‌స‌ర‌మైన చెక్కుల‌ను మంత్రుల స‌మ‌క్షంలో కేటీఆర్ కి అంద‌జేశారు.


ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, గిఫ్ట్ ఎ స్మైల్ లో భాగంగా క‌రోనా బాధితుల‌ను ఆదుకోవ‌డానికి అవ‌స‌ర‌మైన అంబులెన్స్ వాహ‌నాల కోసం అనేక మంది ఎమ్మెల్యేలు, నేత‌లు చెక్కులు అంద‌చేయ‌డాన్ని అభినందించారు. ప్రజలు అభివృద్ధి, సంక్షేమాల‌ కోసం, క‌రోనా బాధితుల‌ను ఆదుకోవ‌డం కోసం త‌మ త‌మ నియోక‌వ‌ర్గాల్లో నిరంత‌రం కృషి చేస్తున్న నేత‌లు ఇలా...సేవ‌కు ముందుకు రావ‌డం వారి ఔదార్యానికి నిదర్శమ‌న్నారు.


ఇదిలాఉండ‌గా, గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా ఉప్పల్‌లోని చిలుకానగర్‌కు చెందిన కరుణాకర్‌రెడ్డి తన ఇంట్లో కిరాయికి ఇంటున్న సంతోష్‌రెడ్డికి ఏకంగా రూ.1.12 లక్షల అద్దె మాఫీచేశారు. కరుణాకర్‌ రెడ్డి ఇంట్లో సంతోష్‌రెడ్డి జిమ్‌ను నడుపుతున్నాడు. లాక్‌డౌన్‌, కరోనా నేపథ్యంలో అది మూతపడింది. అద్దె కట్టలేని పరిస్థితి ఎదురైంది. దీంతో అతడి ఇబ్బందిని గుర్తించిన ఇంటి యజమాని అద్దె మాఫీ చేశాడు. ఆదర్శంగా నిలిచిన కరుణాకర్‌రెడ్డిని పలువురు సత్కరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: