తెలంగాణ సీఎం కేసీఆర్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పేదలకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో ఈ సంవత్సరం చివరినాటికి 74,589 ఇండ్లను పంపిణీ చేసే విధంగా అధికారులు కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి, ఇతర ప్రాంతాల్లోని పేదలను దృష్టిలో ఉంచుకుని ఈ ఇళ్లను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అధికారులు మొత్తం 107 ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్టు తెలుస్తోంది.
 
సనత్ నగర్, నాచారం, ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వం 500 డబుల్ బెడ్ రూం ఇండ్లను గతంలోనే పంపిణీ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 23,076 ఇళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. 25,093 ఇండ్ల నిర్మాణాలు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో 107 ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఇండ్లలో 56 చోట్ల భూగర్భ డ్రైనేజీ అందుబాటులో ఉంది. మిగిలిన 51 ప్రాంతాల్లో మాత్రం మురుగునీటి ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను నిర్మిస్తున్నారు.
 
ఒకవైపు ఇండ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ దశల వారీగా ఇళ్ల పంపిణీ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. మొదటి దశలో దసరా పండుగ నాటికే అప్పటివరకు పూర్తి అయిన డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీ చేయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. అధికారులు మూడు అంతస్తుల కంటే ఎక్కువ ఎత్తులో నిర్మిస్తున్న భవనాలకు మెట్ల దారితో పాటు లిఫ్ట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.
 
రెండు రోజుల క్రితం డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ ప‌నుల గురించి మంత్రులు మ‌హ‌మూద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌లు స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వహించారు. ఇళ్ల నిర్మాణ ప‌నులు త్వ‌రిత‌గిత‌న పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. కలెక్టర్ శ్వేతా మహంతి, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్ స‌హా ప‌లువురు అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడమే టార్గెట్ గా పెట్టుకుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: