నమో మంత్రం పనిచేసింది. దేశ వ్యాప్తంగా మోడీ ప్రభంజనం వీచింది. కమలం పార్టీ దూకుడుకు కాంగ్రెస్ కకావికలైంది. అనేక ప్రాంతీయ పార్టీలూ బీజేపీ హవాను తట్టుకోలేక చేతులెతేశాయి. బీజేపీ సొంతంగా మేజిక్ ఫిగర్ సాధించింది. గెలిచిన సీట్లు, ఆధిక్యం కలిపితే ఎన్డీయే ఖాతాలో 339 సీట్లు చేరాయి. బీజేపీ సొంతంగా 284 సీట్లలో పైచేయి సాధించింది. కాంగ్రెస్ 44 సీట్లకు పరిమితమైంది. యూపీఏ ఖాతాలో 58 సీట్లు మాత్రమే చేరాయి. అన్నా డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీల్లో భారీ విజయాలను సాధించాయి. ఎస్పీ, బీఎస్పీ దారుణంగా దెబ్బతిన్నాయి. మోడీ ప్రభంజనం బీజేపీని ఘన విజయ పథంలో నడిపింది. ఎన్డీయే కూటమి అప్రతిహతంగా ముందు సాగింది. యూపీ నుంచి ఏపీ వరకూ అదే ట్రెండ్. యూపీలో మోడీ హవాకు ఎస్పీ 5 సీట్లకే పరిమితం కావడం అందరినీ ఆశ్చర్య పరిచింది. బీఎస్పీ కనీసం ఖాతా కూడా తెరవలేక పోయింది. గుజరాత్ లోని 26 సీట్లనూ బీజేపీ కైవసం చేసుకుంది. రాజస్థాన్ లోని 25 నియోజకవర్గాల్లోనూ కమలం వికసించింది. మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, హర్యానా, జార్ఖండ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో బీజేపీ ధాటికి కాంగ్రెస్ నామ మాత్రపు సీట్లకు పరిమితమైంది. బీజేపీ మిత్ర పక్షం శివసేన 18 చోట్ల ఆధిక్యం సాధించింది. ప్రాంతీయ పార్టీల్లో అన్నాడీఎంకే, తృణమూల్ మాత్రమే తమ రాష్ట్రాల్లో భారీగా సీట్లను గెల్చుకున్నాయి. తమిళనాడులో అన్నా డీఎంకే 36 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. డీఎంకే గల్లంతైంది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ 34 సీట్లను దక్కించుకుంది. ఈ రాష్ట్రంలో కమ్యూనిస్టులు దారుణంగా దెబ్బతిన్నారు. కేవలం 2 సీట్లకు పరిమితమయ్యారు. మొత్తం మీద సీపీఎం 9 సీట్లకే పరిమితమైంది. ఒడిషాలో బీజేడీ 18 చోట్ల పైచేయి సాధించింది.  ఇక మోడీని బూచిగా చూపి ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన జేడీయూ భారీ మూల్యం చెల్లించుకుంది. 2009లో బీజేపీ పొత్తుతో బీహార్లో 20 సీట్లు గెల్చుకున్న ఈ పార్టీ ఈసారి 2 సీట్ల దగ్గరే ఆగిపోయింది. ఆశ్చర్యకరంగా ఢిల్లీలో ఒక్క సీటూ గెలవని ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో నాలుగు చోట్ల ఆధిక్యంలో ఉంది. యూపీఏ భాగస్వామ్య పార్టీల్లో ఎన్సీపీ ఆరు చోట్ల ఆధిక్యం చాటింది. ఆర్జేడీ 4 సీట్లకు పరిమితమైంది. జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ ఒక్క సీటూ గెలవలేక పోయింది. శ్రీనగర్ లో ఫరూక్ అబ్దుల్లా ఓడిపోయారు. కపిల్ సిబల్, సుశీల్ కుమార్ షిండే, సల్మాన్ ఖుర్షీద్, ప్రఫుల్ పటేల్ సహా పలువురు కేంద్ర మంత్రులు పరాజయం పాలయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: