టీవీ5... తెలుగు దేశం అనుకూల ఛానల్‌గా పేరున్న వార్తాసంస్థ ఇది.. తాజాగా ఈ ఛానల్ కార్యాలయంపై మరోసారి దాడి జరిగింది. టీవీ 5 కార్యాలయంపై జగన్ అభిమాని ఒకరు రాళ్ల దాడికి పాల్పడ్డారు. కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం పెద్దలపురం ప్రాంతానికి చెందిన తేజేశ్వర్‌రెడ్డి టీవీ5 ఛానల్ ప్రధాన కార్యాలయంపై రాళ్లు విసిరారు. నంద్యాల నుంచి వచ్చిన తేజేశ్వర్‌రెడ్డి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 1లోని టీవీ 5 కార్యాలయంపై రాళ్లు విసిరారు.


అసలే టీవీ 5 కార్యాలయం ఓ అద్దాల మేడలా ఉంటుంది. దీంతో రాళ్లు తగిలి కార్యాలయం ముందున్న అద్దాల ప్యానెల్‌ కాస్త దెబ్బ తిన్నది. ఓ అద్దం పగిలింది. అంతే కాదు.. టీవీ5 కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమానికి వచ్చిన వైద్యుడు శ్రీధర్‌రెడ్డి కారుపైనా తేజేశ్వర్‌రెడ్డి విసిరిన రాళ్లు పడ్డాయి. ఆయన కారు అద్దం పగిలింది. కార్యాలయంపై రాళ్లు విసురుతున్న అతడిని గమనించిన టీవీ 5 సెక్యూరిటీ సిబ్బంది అతడిని అడ్డగించారు. తేజేశ్వర్‌రెడ్డిని పట్టుకుని జూబ్లీహిల్స్‌ పోలీసులకు సమాచారం అందించారు.


కొద్దిసేపటి తర్వాత జూబ్లీహిల్స్ పోలీసులు వచ్చి తేజేశ్వర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దాడి చేయడానికి గల కారణాలపై ఆరా తీశారు. పోలీసుల విచారణలో అతడు వైసీపీ అభిమానిగా తేలింది. టీవీ 5 ఛానల్‌ తరచూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన పార్టీని లక్ష్యంగా చేసుకొని కథనాలు చేస్తోందని తేజేశ్వర్‌రెడ్డికి కోపం వచ్చిందట. జగన్ సర్కారుపై టీవీ 5 ఛానల్  తప్పుడు ప్రచారం చేస్తోందని.. అందుకే తాను కోపంతో ఈ దాడికి పాల్పడినట్లు తేజేశ్వర్‌ రెడ్డి తెలిపాడు.

 

ఈ దాడి జరిగిన సమయంలో తేజేశ్వర్‌రెడ్డి మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ టీవీ 5 కార్యాలయంపై దాడి జరగడం ఇదేమీ కొత్త కాదు. గతంలోనూ టీవీ 5 కార్యాలయంపై రాళ్ల దాడులు జరిగాయి. హైదరాబాద్‌ నగరంలో రోడ్డ పక్కనే ఉండటం.. టీవీ 5 పేరుతో అద్దాల మేడ ఉండటంతో వైసీపీ అభిమానలకు ఈ భవనం సులభంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tv5