హుజురాబాద్‌ ఉపఎన్నిక చివరి ఘట్టం ముగిసింది. మొదటి నుంచి నువ్వా- నేనా అన్నట్లుగా టీఆర్ఎస్‌, బీజేపీ మధ్య నెలకొన్న పోరు.. పోలింగ్‌ రోజున స్పష్టం కనిపించింది. ఉపఎన్నికలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు.. వ్యూహ ప్రతివ్యూహాలతో ఉపఎన్నికను రక్తి కట్టించాయి. తమ వద్దనున్న అన్ని అస్త్రాలను ప్రయోగించాయి. హుజురాబాద్‌లో గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలింగ్‌ శాతం కూడా పెరిగింది. దీంతో పెరిగిన పోలింగ్‌ శాతం ఎవరికి లాభిస్తుందోనన్నది చర్చనీయాంశంగా మారింది. అన్నింటికీ మించి ఇప్పుడు విజయం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

హుజారాబాద్‌ ఉపపోరు హోరాహోరీగా సాగినట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. బీజేపీ గెలుపు తథ్యమని కొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అలాగే స్వల్ప  మెజార్టీతో అధికార టీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని మరికొన్ని సర్వేలు వెల్లడించడం విశేషం. ఆత్మసాక్షి సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం... హుజురాబాద్‌లో భారతీయ జనతా పార్టీకి 50.5 శాతం ఓట్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక అధికార టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌కు 43.1 ఓట్లు వస్తాయి. కాంగ్రెస్‌కు 5.7శాతం ఓట్లు రావొచ్చు. ఇతరులు, నోటా కలిపి 0.7 శాతం ఓట్లు వస్తాయని ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

మండలాల వారీగా ఎగ్జిట్ పోల్స్‌ను పరిశీలిస్తే..  ఇల్లంతకుంట మండలంలో టీఆర్‌ఎస్‌కు 50 శాతం, బీజేపీకి 42.5 శాతం ఓట్లు వస్తాయి. కాంగ్రెస్ పార్టీకి 6.5 శాతం, ఇతరులకు ఒక శాతం ఓట్లు రావొచ్చు. కమలాపూర్‌ మండలంలో బీజేపీకి 62 శాతం, టీఆర్‌ఎస్‌కు 32 శాతం ఓట్లు రావొచ్చు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి 5.5 శాతం ఓట్లకు  మించి రాకపోవచ్చు. ఇతరులు, నోటా కలిపి 0.5 శాతం ఓట్లు వస్తాయి. జమ్మికుంట మండలంలో టీఆర్‌ఎస్‌ 47.5 శాతం ఓట్లు సాధిస్తుంది. బీజేపీ 45.5, కాంగ్రెస్ 6, ఇతరులు, నోటా కలిపి ఒక శాతం చొప్పున ఓట్లు సాధించే వీలుందని ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ అంచనా.

ఇక వీణవంక మండలంలో బీజేపీ 55 శాతం, టీఆర్‌ఎస్ 39.5 శాతం, కాంగ్రెస్‌కు 5 శాతం, ఇతరులకు 0.5 శాతం ఓట్లు రావొచ్చు. హుజురాబాద్‌ మండలంలో బీజేపీకి 47.5 శాతం ఓట్లు రావొచ్చు. టీఆర్‌ఎస్‌కు 46.5 శాతం, కాంగ్రెస్‌కు 5.5 శాతం ఇతరులకు 0.5 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. నాగన్న సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం టీఆర్ఎస్‌కు 45.3 నుంచి 48.9 శాతం ఓట్లు రావొచ్చు. బీజేపీకి 42.9 నుంచి 45.5 శాతం వరకు ఓట్లు వస్తాయి. కాంగ్రెస్ కేవలం 2.25 నుంచి 4 శాతం ఓట్లు దక్కించుకుంటుంది. ఇతరులకు 5.51 శాతం నుంచి 6.5 శాతం ఓట్లు వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: