ఆంధ్రప్రదేశ్ లో ఇంగ్లీష్ మీడియం విషయంలో సిఎం వైఎస్ జగన్ చాలా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ముందుకు వెళ్తున్న విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇంగ్లీష్ మీడియం కి సంబంధించి కేంద్రానికి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదులు చేసినా సరే జగన్ మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గలేదు. దానికి తోడు హైకోర్ట్ లో కూడా పిటీషన్ లు వేసి ఇబ్బంది పెట్టాలని విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నా సరే జగన్ ఎక్కడా కూడా తగ్గడం లేదనే చెప్పాలి. ఇదిలా ఉంటే నేడు విద్యాశాఖ మీద సమీక్ష నిర్వహించిన జగన్ పలు కీలక ఆదేశాలు ఇచ్చారు.

ఇంగ్లీషు పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఈ సందర్భంగా స్పష్టం చేసారు జగన్. ఇంగ్లిషు ఉచ్ఛారణ, భాష, వ్యాకరణాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం... దీనికోసం పాఠ్యప్రణాళికలో దృష్టిపెట్టాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. పిల్లలకు ఇదివరకే డిక్షనరీలు ఇచ్చామని, వాటిని వినియోగించుకోవాలన్న సీఎం... ప్రతిరోజూ కనీసం మూడు పదాలు నేర్పించాలని, ఆ పదాలను వినియోగించడంపై పిల్లలకు నేర్పించాలని స్పష్టం చేసారు ఆయన. ఎయిడెడ్‌ పాఠశాలలను ప్రభుత్వానికి అప్పగించడం అన్నది పూర్తిగా స్వచ్ఛందం అని సమావేశంలో మరోసారి స్పష్టం చేసారు సిఎం.

వివిధ కారణాలతో నడుపుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారికి ప్రభుత్వం ఒక అవకాశం మాత్రమే కల్పిస్తుందని సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేసారు. ఇష్టం ఉన్నవారు, స్వచ్ఛందంగా ప్రభుత్వంలో విలీనంచేయొచ్చని, లేదంటే యథాప్రకారం నడుపుకోవచ్చని మరోసారి స్పష్టం చేసారు ఆయన. విలీనంచేస్తే.. వారి పేర్లు కొనసాగిస్తామని ఈ సందర్భంగా ఆయన అధికారుల వద్ద పేర్కొన్నారు. ప్రభుత్వంలో విలీనానికి ముందు అంగీకరించిన వారు... నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని నడుపుకుంటామంటే.. నిరభ్యంతరంగా వెనక్కి తీసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులకు మంచి సదుపాయాలు, నాణ్యమైన విద్య అందాలన్నదే ఉద్దేశమని స్పష్టం చేసారు ఆయన. ఈ ప్రక్రియలో ఎక్కడా బలవంతంలేదని, ఈ విషయంలో అపోహలకు గురికావొద్దని, రాజకీయాలుకూడా తగవని జగన్ అధికారుల వద్ద స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: