వైఎస్ వివేకా హ‌త్య కేసులో సంచ‌ల‌నం చోటుచేసుకుంది. సీబీఐ అధికారులు కేసును త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌నే అనుమానం మొద‌లైంది. క‌ల్లూరి గంగాధ‌ర్‌రెడ్డి అనే వ్య‌క్తి అనంత‌పురం ఎస్పీ ఫ‌క్కీర‌ప్ప‌ను క‌లిసి ఫిర్యాదు చేయ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. వివేకానంద‌రెడ్డిని ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయ‌న తండ్రి భాస్క‌ర్‌రెడ్డి, వైసీపీ నేత దేవిరెడ్డి శంక‌ర్‌రెడ్డిలే హ‌త్య చేయించిన‌ట్లు ఒప్పుకోవాల‌ని బెదిరించిన‌ట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

అవినాశ్‌రెడ్డిని ఇరికిస్తున్నారా..!
వివేకా హత్య కేసులో కీలక మలుపులు తిరుగుతున్నాయి. అవినాశ్‌రెడ్డిని బ‌ల‌వంతంగా ఈ కేసులో ఇరికించేలా కుట్రలు జ‌రుగుతున్నాయ‌నే అనుమానాలు మొద‌ల‌య్యాయి. సీబీఐ అద‌న‌పు ఎస్పీ రామ్‌సింగ్‌, అప్ప‌ట్లో సిట్‌లో ప‌నిచేసిన మ‌డ‌క‌శిర సీఐ శ్రీ‌రామ్ బెదిరిస్తున్నారు అని గంగాధ‌ర్‌రెడ్డి పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. ప్ర‌స్తుతం సీబీఐ క‌స్ట‌డీలో ఉన్న దేవిరెడ్డి శంక‌ర్‌రెడ్డికి ముఖ్య అనుచ‌రుడిగా గంగాధ‌ర్‌రెడ్డి చెప్పుకుంటున్నాడు.

ఎమ్మెల్సీ కోస‌మే హ‌త్య జ‌రిగిందా..?
వైఎస్ వివేకానంద‌రెడ్డి ఎమ్మెల్సీగా పోటీలో ఉండ‌డ‌మే ఆయ‌న హ‌త్య‌కు కార‌ణ‌మైందా? అనే అనుమానాలు కార్య‌క‌ర్త‌లు వ్య‌క్తం చేస్తున్నారు. గంగాధ‌ర్‌రెడ్డి పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో ఈ వివ‌రాలే వెలుగు చూశాయి. సోష‌ల్ మీడియాలో పోస్టుల ద్వారా వివేకా ఎమ్మెల్సీగా ఓడిపోవ‌డానికి కృషి చేశాన‌ని.. ఇదే క్ర‌మంలో హ‌త్య జ‌రిగింద‌ని అత‌ను ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఈ సంద‌ర్భంగా అప్ప‌టి సిట్ అధికారి సీఐ శ్రీ‌రామ్ పిలిపించి.. వివేకాను హ‌త్య చేస్తే రూ.10 కోట్లు ఇచ్చేలా శంక‌ర్‌రెడ్డితో ఒప్పందం చేసుకున్న‌ట్లు ఒప్పుకోవాల‌ని చిత్ర‌హింస‌ల‌కు గురిచేశార‌ని గంగాధ‌ర్‌రెడ్డి చెప్పుకొచ్చాడు. ఆ త‌ర్వాత కేసు చేప‌ట్టిన సీబీఐ అద‌న‌పు ఎస్పీ రామ్‌సింగ్ కూడా బెదిరించార‌ట‌.

కేసు తేలేనా..?
రోజుకు ఒక ఆస‌క్తిక‌ర ప‌రిణామాల‌తో వైఎస్ వివేకా హ‌త్య కేసు ముందుకు వెళుతోంది. రోజుకు ఒక‌రి పాత్ర వెలుగులోకి వ‌స్తోంది. వివేకా హ‌త్య జ‌రిగి రెండేళ్లు దాటుతున్నా ఈ కేసులో ఎలాంటి పురోగ‌తి లేకుండా పోయింది. క‌ల్లూరు గంగాధ‌ర్‌రెడ్డి అనే వ్య‌క్తి క‌డ‌ప పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌కుండా.. అనంత‌పురం పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంలోనే ఏదో మ‌త‌ల‌బు ఉన్న‌ట్లు క‌న‌ప‌డుతోంది. కేసు ఎప్ప‌టికి తేలుతుందో? దోషులుగా ఎవ‌రిని నిర్దారిస్తారో.. ఎవ‌రు నిర్దోషులుగా బ‌య‌ట ప‌డ‌తారోన‌నే ఉత్కంఠ‌లో కుటుంబ‌స‌భ్యులు, అనుచ‌రులు వేచి చూస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: