సజ్జనార్ ఐపీఎస్... ఎక్కడ ఉన్నా  సరే... తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించారు సజ్జనార్. వరంగల జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్, దిశ కేసులో అత్యాచారం, హత్య చేసిన వారిని సరిగ్గా రెండు రోజుల్లోనే ఎన్‌కౌంటర్ చేసిన కేసులో కూడా సజ్జనార్ కీలకంగా వ్యవహరించారు. పోలీసు శాఖలో కీలకమైన స్థానాల్లో వ్యవహరించిన సజ్జనార్... ఇప్పుడు మరోసారి తన మార్క్ చూపించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థకు ఎండీగా వ్యవహరిస్తున్న సజ్జనార్. గతంలో పని చేసిన ఎండీల తీరుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. బస్టాండ్ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు, గ్రామాల్లో తిరుగుతున్న బస్సులపై ఆరా, ప్రయాణీకుల నుంచి వివరాల సేకరణ, సిబ్బంది పనితీరు వంటి అంశాలపై సజ్జనార్ తనదైన శైలీలో వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ పీకల్లోతు అప్పుల్లో ఉందంటూ ఛార్జీల పెంపునకు కూడా సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపేశారు సజ్జనార్. అటు ఆదాయం పెంచుకునేందుకు కూడా వినూత్న మార్గాలను అనుసరిస్తున్నారు.

హైదరాబాద్ నగర పరిధిలో నష్టాల్లో ఉన్న డిపోలను మూసివేయాలని నిర్ణయించారు. సిబ్బందిని, బస్సులను ఇప్పటికే ఇతర డిపోలకు కేటాయించారు. అదే సమయంలో ఆయా డిపోల స్థలాలను లీజుకు ఇవ్వడం ద్వారా సంస్థకు అదనపు ఆదాయం వస్తుందని కూడా సజ్జనార్ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఇక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో దూసుకెళ్తున్న సజ్జనార్.. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించేందుకు మొగ్గు చూపుతున్నారు. తమ గ్రామానికి బస్ కావాలని ఎవరైనా సరే... ఓ ట్వీట్ చేస్తే చాలు... సంబంధిత అధికారులతో సర్వే నిర్వహించి... వెంటనే ఆ ప్రాంతానికి బస్సు ఏర్పాటు చేస్తున్నారు కూడా. తాజాగా మంచిర్యాల జిల్లా కోనంపేట గ్రామానికి దాదాపు 30 ఏళ్లుగా బస్సు సౌకర్యం లేదు. ఇదే విషయాన్ని గ్రామస్థులు సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు. సరిగ్గా నాలుగు రోజుల్లోనే ఆ గ్రామానికి బస్ వచ్చేలా చేశారు సజ్జనార్. దీంతో 30 ఏళ్ల తమ కల నెరవేరిందంటూ... గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: