తెలుగుదేశంపార్టీకి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ దూరమైపోయినట్లేనా ? క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. పైగా ఇదే విషయమై పార్టీకి ఎంపీ దూరమైపోయినట్లే అన్నట్లుగా చంద్రబాబునాయుడుకు మద్దతుగా ఉండే మీడియా పెద్ద కథనమే అచ్చేసింది. దాంతో తమ్ముళ్ళు, నియోజకవర్గంలోని జనాలు కూడా టీడీపీకి ఎంపీ గల్లా దూరమైపోయారనే చెప్పుకుంటున్నారు.

ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీకి దూరమైపోయినట్లు చాలా కథనాలే వచ్చాయి. పార్టీ కార్యక్రమాల్లో కానీ పార్టీ నేతల సమావేశాల్లో కానీ కేశినేని కనిపించటంలేదు. అధినేతను కూడా సరిగా కలవటంలేదు. ఈమధ్య చంద్రబాబు చేసిన ఒక్కరోజు దీక్షలో మాత్రం కేశినేని కనిపించారు. అంతే ఆ తర్వాత మళ్ళీ అడ్రస్ లేరు. పార్టీలోనే ఆయన్ను వ్యతిరేకిస్తున్న బలమైన వర్గంతో ఆయనకు ఏమాత్రం పడటం లేదని అందరికీ తెలిసిందే. తన ప్రత్యర్ధి వర్గానికి చంద్రబాబు మద్దతిస్తున్నారనేది ఎంపీ అనుమానం.

అందుకనే పార్టీతో కానీ చంద్రబాబుతో కానీ అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. ఇపుడు అదే రీతలో గుంటూరు ఎంపీ కూడా తయారయ్యారట. దాంతో ఇద్దరు ఎంపీలు పార్టీకి దూరమైపోయినట్లే అనుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే చాలా రోజులుగా గల్లా పార్టీ కార్యక్రమాలకు, నేతలకు దూరంగా ఉంటున్నారట. అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని అమరావతి జేఏసీ పాదయాత్ర చేస్తున్న సందర్భంగా కూడా గల్లా మొదట్లో ఎక్కడా కనిపించలేదు. అయితే శ్రీకాళహస్తి నియోజకవర్గం దాటినపుడు మాత్రమే పాదయాత్రలో మొక్కుబడిగా కలిశారు.  దాంతో రాజధాని ప్రాంత రైతులు, పార్టీ నేతల్లో ఎంపీపై బాగా మంటగా ఉందని సమాచారం.

పార్టీ ఆఫీసుల మీద వైసీపీ వాళ్ళు దాడుల తర్వాత చంద్రబాబు చేసిన దీక్షలో కూడా గల్లా ఎక్కడా కనబడలేదు. కనీసం పార్టీ ఆఫీసుల మీద జరిగిన దాడిని ఖండిస్తు ప్రకటన కూడా చేయలేదు. ఆ తర్వాత చంద్రబాబు మూడు రోజులు ఢిల్లీలోనే ఉన్నారు. చంద్రబాబు పర్యటనలో కూడా ఎంపీ ఎక్కడా కనబడలేదు. చివరకు భువనేశ్వరిని అవమానించారని చంద్రబాబు భోరున ఏడ్చిన తర్వాత కూడా ఎంపీ ఎక్కడా స్పందించలేదు. పార్టీ నేతలకే కాదు చివరకు గుంటూరులోని నేతలు+క్యాడర్ కు కూడా ఎంపీ దొరకటంలేదు.

తాజాగా జరిగుతున్న పార్లమెంటు సమావేశాల్లో కూడా ఎంపీ ఎక్కడా కనబడటంలేదు. నిజానికి మిగిలిన ఇద్దరు ఎంపీల జాడ కూడా కనబడకపోయినా అందరు గల్లా గురించే చెప్పుకుంటున్నారు. కేశినేని తో పాటు గల్లా కూడా తొందరలోనే బీజేపీలో చేరబోతున్నట్లు బాగా ప్రచారం జరుగుతోంది. మరి జరుగుతున్నది ఉత్త ప్రచారం మాత్రమేనా లేకపోతే అందులో నిజముందా అన్నదే అర్ధం కావటంలేదు. ఏదేమైనా గల్లా అడ్రస్ లేకపోవటంతో బీజేపీలో చేరుతారనే ప్రచారం పెరిగిపోతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

TDP