తెలంగాణ‌లో తిరుగులేని శ‌క్తిగా మారాల‌ని చూస్తున్న బీజేపీకి రాబోయే ఎన్నిక‌లు స‌వాల్‌గా మార‌నున్నాయి. దీంతో పార్టీతో పాటు ఆర్ఎస్ఎస్ కూడా రంగంలోకి దిగింద‌నే ఊహాగానాలు వ్య‌క్తం అవుతున్నాయి. దీనికి కార‌ణం ఆర్ఎస్ఎస్ కీలక స‌మావేశం హైద‌రాబాద్‌లో నిర్వ‌హించ‌డ‌మే. ఆర్ఎస్ఎస్ అన్ని అనుబంధ సంస్థ‌లు పాల్గొనున్న ఈ  స‌మావేశంలో ఆ పార్టీ జాతీయాధ్య‌క్షుడు జేపీ న‌డ్డా రానుండ‌డంతో ఈ స‌మావేశానికి ప్రాధాన్య‌త ఏర్ప‌డింది. తెలంగాణ‌లో వ‌చ్చె ఎన్నిక‌ల కోసం సంబంధించిన వ్యూహాల‌ను ఇందులో ఖ‌రారు చేసే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం. అలాగే, ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు ఎలాంటి అంశాల‌ను ఎంచుకోవాల‌నే దానిపై నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్టు తెలుస్తోంది. 


మొద‌టి నుంచి ప్ర‌జా స‌మ‌స్య‌ల కంటే భావోద్వేగాల‌పైనే బీజేపీ ఎక్కువ‌గా ఆధార‌ప‌డి ఉంద‌ని బ‌హిరంగానే అంద‌రికి తెలిసిన విష‌య‌మే. అయోధ్య రామాల‌యం అంశం త‌రువాతే బీజేపీ అధికారంలోకి వ‌చ్చేంత బ‌లం పెంచుకుంది. అందుకే అదే స్ట్రాట‌జీని తెలంగాణ‌లో కూడా అమ‌లు పరిచేందుకు కాషాయ నేత‌లు వ్యూహాలు ర‌చిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇందులో భాగంగానే  తెలంగాణ ఉద్య‌మానికి సంబంధించిన ప్ర‌తి విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని చూస్తోంది. తెలంగాణ విమోచ‌న దినాన్ని అధికారంగా నిర్వ‌హించాల‌నే డిమాండ్‌ను తెర‌పైకి తీసుకువ‌చ్చింది. ఇప్పుడు హైద‌రాబాద్ పేరును మార్చాల‌నే డిమాండ్‌ను కూడా తీసుకువ‌స్తార‌నేది స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.


    ఒక హైద‌రాబాదే కాకుండా ఇత‌ర ప‌ట్ట‌ణాల పేర్ల మార్పు కూడా తెర‌పైకి తీసుకురావ‌చ్చు.. దీని వ‌ల్ల పార్టీ అక్క‌డ కూడా బ‌ల‌ప‌డుతుంద‌నే అంచనాలు వేస్తుంది. అంతేకాకుండా హైద‌రాబాద్‌లో పార్టీకి బ‌లం ఎక్కువ‌గా ఉండ‌డంతో గ్రేట‌ర్ హైద‌రాబాద్ పై ఎక్కువగా ఫోక‌స్ పెట్టింది. గ్రేట‌ర్‌తో పాటు ప‌క్క‌నే ఉన్న రంగారెడ్డి జిల్లాపై ప‌ట్టు సాధిస్తే క‌నీసం 20 స్థానాలు గెలుపొందే అవ‌కాశాలు ఉన్నాయ‌ని.. దీనికి త‌గ్గ వ్యూహాలు సిద్ధం చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఇందు కోసం ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ‌లు కూడా రంగంలోకి దిగుతాయ‌ని తెలుస్తోంది. ఈ స‌మావేశంలో బీజేపీ బ‌లం పెంచుకోవ‌డానికి ఆర్ఎస్ఎస్ అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై చ‌ర్చించ‌నున్న‌ట్టు స‌మాచారం.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP