భారత విమానయాన చరిత్రలోనే ఓ పెను ప్రమాదం తప్పింది. ఇంకా చెప్పాలంటే.. ప్రపంచంలోనే ఇలాంటి ప్రమాదం ఇప్పటి వరకు జరగలేదు కూడా. బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. రెండు విమానాలు గాల్లోనే పరస్పరం ఢీ కొట్టుకోబోయాయి. రాడార్ కంట్రోలర్ వ్యవస్థ సకాలంలో స్పందించడంతో ఘోర ప్రమాదం తప్పింది. బెంగళూరు విమానాశ్రయంలో రెండు విమానాలు దాదాపు ఢీ కొట్టుకునే వరకు ఎదురుపడ్డాయి. చివరి నిమిషంలో ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే డీజీసీఏ వివరాలు సేకరించింది. పూర్తిస్థాయి వివరాల కోసం ఓ ప్రత్యేక విచారణ కమిటీని కూడా డీజీసీఏ నియమించింది. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో జనవరి నెల 7వ తేదీన ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒకే సమయంలో ఎదురుపడిన రెండు విమానాలు కూడా ఇండిగో ఎయిర్ లైన్స్‌కు చెందినవే. రెండు ఇండిగో విమానాల్లో ఒకటి కోల్‌కతా వెళ్లాల్సి ఉండగా... మరోకటి ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళ్లాల్సి ఉంది. ఈ రెండు విమానాలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ టేకాఫ్ అయ్యేందుకు ఒకేసారి అనుమతి ఇచ్చేసింది. దీంతో రెండు విమానాలు కూడా టేకాఫ్ కోసం రెడీ అయ్యాయి. కెంపెగౌడ విమానాశ్రయంలో ప్రస్తుతం విమానాల రాకపోకల కోసం రెండు రన్ వేలను వినియోగిస్తున్నారు. టేకాఫ్ కోసం ఒక రన్ వే, ల్యాండింగ్ కోసం మరో రన్ వే వినియోగిస్తున్నారు. కానీ అధికారులు మాత్రం రెండు విమానాలకు రెండు వేరు వేరు రన్ వేలపై టేకాఫ్ కోసం అనుమతి ఇచ్చారు. కానీ ఎయిర్ పోర్టులో రెండు విమానాలు ఒకేసారి రెండు రన్ వేలపై నుంచి టేకాఫ్ అయ్యే పరిస్ధితులు లేవు. దీని వల్ల రెండు విమానాలు ఒకే రన్ వే పై నుంచి టేకాఫ్ అయ్యేందుకు రెడీ అయ్యాయి. దీంతో రెండు విమానాలు ఒకదానికొకటి ఢీకొనే పరిస్థితి ఏర్పడింది. పరిస్థితిని గుర్తించిన రాడార్ కంట్రోలర్ వెంటనే జోక్యం చేసుకుని విమానాన్ని అప్రమత్తం చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: