రష్యా దూకుడు తగ్గించుకోకుండా.. యుద్ధానికి తెగబడితే ఆ దేశంపై కనీవినీ ఎరుగని రీతిలో ఆర్థిక ఆంక్షలు విధిస్తామని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ హెచ్చరించారు. జర్మనీలోని మ్యూనిక్ భద్రతా సమావేశంలో ఆమె ప్రసంగించారు. రష్యా యుద్ధం చేస్తే.. అమెరికాకు ఐరోపా దేశాలు మరింత చేరువవుతాయని.. ఇది ఆ దేశానికే ప్రమాదమని అన్నారు. ఉక్రెయిన్ కు ఎలాంటి ముప్పు వచ్చినా తీవ్రంగా తీసుకుంటామని తెలిపారు.

మరో రెండు రోజుల్లో రష్యా-ఉక్రెయిన్ పై దాడి చేసే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించగా.. ఆమెరికాతో చర్చలు జరిపేందుకు సిద్ధమైంది రష్యా. ఈ మేరకు రష్యా విదేశాంగశాఖ ప్రతిపాదించిన తేదీలకు అమెరికా అంగీకరించింది. అయితే ఉక్రెయిన్ పై రష్యా దాడి చేయొద్దన్న షరతుతోనే అగ్రరాజ్యం ఈ చర్చలకు ఓకే చెప్పినట్టు తెలిపింది. మరోవైపు రష్యా మద్దతున్న వేర్పాటువాదులు ఉక్రెయిన్ పై కాల్పులు జరపడం కలకలం రేపుతోంది.

ఇక ఉక్రెయిన్, రష్యా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఉక్రెయిన్ సరిహద్దుల్లో సైనిక విన్యాసాలు చేస్తామని రష్యా ప్రకటించింది. ఖండాంతర, క్రూయిజ్ క్షిపణులతో సైనిక విన్యాసాలు చేస్తామని వెల్లడించింది. ఈ విన్యాసాల్లో రష్యాకు చెందిన బ్లాక్ సీ నౌకాదళం పాల్గొననుంది. ఉక్రెయిన్ సరిహద్దులు, బెలారస్ కు  లక్షన్నర మంది సైనికులను రష్యా తరలించింది.

అంతేకాదు ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నవేళ.. రష్యా సర్కారు తీసుకున్న నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది. అధ్యక్షుడు పుతిన్ సమక్షంలో రష్యా సైన్యం ఇప్పటికే వ్యూహాత్మక డ్రిల్ నిర్వహించింది. బెలారస్ లో సైనిక శిక్షణ పూర్తి చేసుకున్న సైన్యం.. శిక్షణలో భాగంగా బాలిస్టిక్ తో పాటు క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించనుంది. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో పుతిన్ నిర్ణయం సంచలనంగా మారింది.

ఇక తూర్పు ఉక్రెయిన్ లో ఉన్న డొనెస్కీ ప్రాంతంలో ఘర్షణ మొదలైంది. ఉక్రెయి్ ఆర్మీ, వేర్పాటు వాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. వేర్పాటు వాదుల దాడిలో ఓ ఉక్రెయిన్ సైనికుడు మరణించినట్టు తెలుస్తోంది. వేర్పాటువాదులకు రష్యా మద్ధతు ఉందని సమాచారం. ఉక్రెయిన్ దళాలు మోర్టార్లు, గ్రేనేడ్ లాంచర్లు, యాంటి ట్యాంక్ మిస్సైల్ సిస్టమ్స్ తో దాడి చేస్తున్నాయి. డొనెస్కీ నుంచి 25వేల మందిని రష్యాకు తరలించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: