ఉక్రెయిన్ లో ప్రవేశించి కీలక నగరాలను స్వాధీనం చేసుకుంటున్న రష్యా సైనికులు అక్కడ దొంగతనాలు చేస్తున్నారు. ట్యాంకులకు అక్రమంగా ఆయిల్ నింపుకుంటున్నారు. మాల్స్ లోకి ప్రవేశించి దుస్తులు, డ్రింక్స్, తినుబండారాలు దోచుకొని పోతున్నారు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. రష్యా సైనికులు చేసిన ఈ పనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక ఉక్రెయిన్ నుంచి పోలెండ్ బోర్డర్ లోకి వచ్చే ఇండియన్స్ కు వీసాలు అవసరం లేదని ఆ దేశం చెబుతున్నప్పటికీ పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థులను కాళ్లతో తన్నుతూ హింసిస్తున్నారు. ఆడవాళ్లు కాళ్లు మొక్కాలనీ.. మగవాళ్లు తాము చెప్పినట్టు వింటేనే రానిస్తామంటూ షరతులు పెడుతున్నారు. కేరళకు చెందిన ఓ విద్యార్థి అక్కడి పరిస్థితిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

రష్యా యుద్ధం కారణంగా ఇప్పటి వరకు ఉక్రెయిన్ నుంచి 3.68లక్షల మంది వలస వెళ్లినట్టు ఐక్యరాజ్య సమితి తెలిపింది. వీరంతా పోలండ్, హంగేరీ, రొమేనియా తదితర దేశాల్లో తలదాచుకుంటున్నట్టు పేర్కొంది. పోలండ్ సరిహద్దుల్లో 14కిలోమీటర్ల పొడవైన క్యూ ఉందని చెప్పింది. వీరిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారనీ.. ఎముకలు కొరికే చలిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని పేర్కొంది.

మరోవైపు ఉక్రెయిన్ పై రష్యా దాడులు భీకరంగా కొనసాగుతున్నాయి. రాజధాని కీవ్ లోకి ప్రవేశించేందుకు రష్యా సేనలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఉక్రెయిన్ లోని గ్యాస్, చమురు నిక్షేపాలపై దాడులకు పాల్పడుతున్నాయి. కార్కివ్ లోని గ్యాస్ పైప్ లైన్ ను రష్యా సైనికులు పేల్చేశారు. ఉక్రెయిన్ బలగాలు మాత్రం రష్యా దాడులను తిప్పికొడుతున్నాయి. కీవ్ లోకి ప్రవేశించకుండా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి.


ఇక రష్యాలోని మరో రెండు నగరాలను ముట్టడించినట్టు రష్యా వెల్లడించింది. దక్షిణ, ఆగ్నేయ ప్రాంతంలోకి నగరాలను చుట్టుముట్టినట్టు తెలిపింది. కర్కీవ్ నగరంలోకి ప్రవేశించినట్టు పేర్కొంది. మరోవైపు రష్యాతో చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు. అయితే రష్యా ప్రతిపాదించిన బెలారస్ లో కాకుండా మరో ప్రదేశంలో అయితే చర్చలకు వస్తామని వెల్లడించారు.

 






మరింత సమాచారం తెలుసుకోండి: