కొన్ని రోజులు సొంత ఇంటిని విడిచి వెళ్లాలంటేనే గుండె బరువెక్కి పోతుంది. అలాంటిది మళ్ళీ తిరిగి వస్తామో లేదో తెలియని పరిస్థితుల్లో కట్టుబట్టలతో దేశాన్నే దాటాల్సి వస్తే.. ఊహించడానికే కష్టంగా ఉన్నా ప్రస్తుతం ఉక్రెయిన్ వాసుల దీనపరిస్థితైతే ఇదే. ఒకరు ఇద్దరు కాదు ఏకంగా లక్షలమంది ఉక్రేనియన్ లు దేశం విడిచి వెళ్లిపోతున్నారు. రష్యన్ సేనల దాడులతో బతుకు జీవుడా అని సరిహద్దు దాటుతున్నారు. ఒకరిద్దరు తీసుకున్న యుద్ధ నిర్ణయానికి తమ భవిష్యత్తు బలైపోతుందని బోరున విలపిస్తున్నారు. ఉక్రెయిన్ ప్రజల దారుణ పరిస్థితులకు కారణం ఎవరు..? ఇంతటి విధ్వంసంతో ఆ రెండు దేశాలు సాధించిందేంటి..?

 ఉక్రెయిన్ లో ఎక్కడ చూసినా అవే దృశ్యాలు. అవే కన్నీళ్లు.. యుద్ధ సంక్షోభంతో లక్షలాదిమంది ప్రజలు కన్నీళ్లను దిగమింగుకుని  పుట్టిన దేశం విడిచి వెళ్తున్నారు. మళ్లీ వస్తామో లేదో అన్న ఆలోచనే వారికి లేదు. ఎందుకంటే తిరిగొచ్చిన మాతృభూమిలో మిగిలేదేమీ ఉండదని వాళ్లకు తెలుసు. రష్యన్ సేనల బీభత్స కాండకు కళ్ళముందే తమ బతుకులు చితిలమైపోయిన వేళ కన్న పిల్లల భవిష్యత్తును భుజాలపై మోస్తూ కట్టుబట్టలతో పరాయి దేశం గడప తొక్కుతున్నారు. ఇప్పటివరకు ఇలా వలస వెళ్లిన వారి సంఖ్య దాదాపు 15 లక్షల పైగానే అన్న అంచనాలు యావత్ ప్రపంచాన్ని కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ చరిత్రలోనే  భారీగా వలసలు జరగడం ఇదే మొదటిసారి అని యుఎన్ఓ శరణార్థి  సంస్థ పేర్కొంది. ఇక్కడితో వలసలు ఆగే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఈ సంఖ్య 70 లక్షల వరకు చేరే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది. ఈ శతాబ్దంలోనే అతిపెద్ద మానవ సంక్షోభం అని ఉక్రెయిన్, రష్యా యుద్ధ ప్రభావం1.80 కోట్ల మంది ప్రజల పై ఉంటుందని ఐరాస అంచనా వేస్తోంది. ప్రధానంగా ఉక్రెయిన్ నుంచి సరిహద్దు దేశాలైన పోలాండ్, హంగేరి, మల్డోవా, రొమేనియా దేశాలకు  వలసల పర్వం కొనసాగుతోంది. మరోవైపు దేశం దాటి వెళ్ళే క్రమంలో ఉక్రెయిన్ పౌరులు అనుభవిస్తున్న నరకయాతన అంతా ఇంతా కాదు. సరిహద్దు దేశాలకు చేరే చివరి 50 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిందే.


ఇలాంటి సమయంలోనూ పలు దేశాల అధికారులు జాతి వివక్షతకు పాల్పడుతుండడం కలవరపెడుతోంది. ఇలాంటి సంఘటనలతో మానవ సంబంధాలు ఏ స్థాయికి పడిపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఉక్రెయిన్ రష్యా దేశాలు కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం ఒక్క అడుగు వెనక్కు తగ్గే లేకపోయారా? ఈ విలయం చూసైనా మరే దేశం యుద్ధానికి కాలుదువ్వకూడదంటున్నారు మానవతావాదులు.

మరింత సమాచారం తెలుసుకోండి: