వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన వార్నింగ్ ఇచ్చారు. రెండేళ్ళల్లో పనితీరు మార్చుకోని ఎంఎల్ఏలకు టికెట్లిచ్చేది లేదన్న విషయాన్ని జగన్ చాలా స్పష్టంగా చెప్పేశారు. మంత్రులు, జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లతో ప్రత్యేకించి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతు ప్రభుత్వం పనితీరు, మంత్రులు, ఎంఎల్ఏల పనితీరుపై రెగ్యులర్ గా సర్వే చేయిస్తున్నట్లు చెప్పి పెద్ద బాంబు వేశారు.





చేయించిన సర్వేల్లో  తన పరిపాలనపై జనాల్లో 65 శాతం సంతృప్తి ఉన్నట్లు చెప్పారు. అలాగే కొందరు మంత్రులు, ఎంఎల్ఏల పనితీరు ఆశించినంత బాగా లేదని కూడా చెప్పేశారు. ప్రత్యేకించి ఎవరి పేరును ప్రస్తావించకపోయినా పనితీరు మెరుగుపరుచుకుని, జనాలకు దూరమైపోయిన వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదన్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు.





మంత్రులు, ఎంఎల్ఏలను తనకుటుంబ సభ్యులుగా భావించబట్టే పనితీరు మెరుగుపరుచుకోమని సూచన చేస్తున్నట్లు జగన్ చెప్పారు. జగన్ సలహా ప్రకారం పనితీరు మెరుగుపరుచుకున్నారని జగన్ అనుకుంటే మళ్ళీ టికెట్టుకు ఢోకా ఉండదు. అలాకాకపోతే మాత్రం టికెట్ పై ఆశలు వదులుకోవాల్సిందే. ఇదే విషయాన్ని మాజీమంత్రి కొడాలి నాని మాట్లాడుతు జగన్ పనితీరుపై జనాల్లో 65 శాతం సంతృప్తి ఉన్నా కొందరు ఎంఎల్ఏలపైన మాత్రం జనాల్లో 45 శాతమే సంతృప్తి ఉందన్నారు.





మంత్రులు, ఎంఎల్ఏల పనితీరుపై జనాల్లో ఆశించినంతగా సంతృప్తిలేకపోతే దానికి జగన్ బాధ్యత వహించరని కొడాలి అన్నదాంట్లో వాస్తవముంది. ఆశించిన మేరకు పనిచేయని వారికి కచ్చితంగా జగన్ టికెట్లివ్వరని కొడాలి తేల్చేశారు. ఏ పార్టీకూడా ఓడిపోయేవారికి టికెట్లివ్వదు కదా అంటు మీడియానే ఎదురు ప్రశ్నించారు. మొన్నటి క్యాబినెట్ పునర్ వ్యవస్ధీకరణలో కూడా ఎంత సన్నిహితులుగా ముద్రపడిన వారిని కూడా జగన్ దూరంగా పెట్టేసిన విషయం తెలిసిందే. అదే పద్దతిని రేపటి ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో కూడా అనుసరించబోతున్నారనటంలో సందేహంలేదు. కాకపోతే ఎంతమందికి టికెట్లు నిరాకరిస్తారనేది చూడాలి. మొత్తానికి జగన్ తాజా వార్నింగ్ తో మంత్రులు, ఎంఎల్ఏల్లో టెన్షన్ మొదలైందన్నది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: