
భారత్ లో హిందీ జాతీయ భాష అనే వివాదం రోజు రోజుకీ మరింత ముదురుతోంది. వివిధ రాష్ట్రాలకు చెందినవారంతా ఒకేచోట కలిస్తే.. వారంతా ఇంగ్లిష్ కాకుండా, హిందీలో మాట్లాడాలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో ఈ దుమారం మొదలైంది. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ హిందీయే మన జాతీయ భాష అంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్టింగ్ దుమారానికి కారణం అయింది. ఎప్పటికీ మన జాతీయ భాష హిందీయేనంటూ పోస్టింగ్ లు పెట్టారు అజయ్ దేవగణ్. అయితే ఆయనకి కౌంటర్ గా కన్నడ నటుడు సుదీప్ సోషల్ మీడియా వేదికగా సమాధానమిచ్చారు. ఆ తర్వాత వారిద్దరి వాదనలు శాంతంగానే ముగిసినా.. చర్చ మాత్రం హిందీ చుట్టూ తిరిగింది.
ఇటీవల దక్షిణాది సినిమాలు బాలీవుడ్ లో కూడా బంపర్ హిట్లు అవుతున్నాయి. దీంతో సహజంగానే హిందీ చిత్ర పరిశ్రమలో కొందరు అసూయతో రగిలిపోతున్నారనే ప్రచారం ఉంది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా మూవీస్ సత్తా ఏంటో, తెలుగు నుంచి వచ్చి బాలీవుడ్ ని కొల్లగొట్టే రేంజ్ సినిమాల కథేంటో రుజువైంది. ఆ తర్వాత దానికి కొనసాగింపుగా పుష్ప, ఆర్ఆర్ఆర్ కూడా ఆ స్థాయిని నిలబెట్టాయి. ఇక కేజీఎఫ్ సిరీస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కేజీఎఫ్ చాప్టర్-1, చాప్టర్-2 రెండూ.. బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేశాయి.
కేజీఎఫ్–2 సినిమా బాలీవుడ్ లో కూడా సూపర్ హిట్ గా నిలిచిన సందర్భంలో కన్నడ నటుడు సుదీప్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ మధ్య సోషల్ మీడియాలో జరిగిన చర్చ చివరకు రాజకీయ రచ్చకి దారితీసింది. కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై, మాజీ సీఎంలు సిద్ధరామయ్య, కుమారస్వామి కూడా సుదీప్ కి మద్దతుగా తమ సందేశాలను సోషల్ మీడియాలో ఉంచారు. దేశంలో హిందీ కూడా ఇతర ప్రాంతీయ భాషల లాగానే ఒక భాష అని, అంతే కాని జాతీయ భాషగా హిందీని గుర్తించలేమని వారు చెప్పారు. భాషా ప్రాతిపదికన కొత్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత, ఎక్కడికక్కడ స్థానిక భాషే సుప్రీం అని అన్నారు నాయకులు. ఇలా భాష విషయంలో జరుగుతున్న ఈ చర్చ కొనసాగుతూనే ఉంది.